RCB: అభిమానుల మరణాలపై మౌనం వీడిన ఆర్సీబీ.. 3 నెలల తర్వాత ఫ్యాన్స్‌కు భావోద్వేగ సందేశం

RCBs first post in 3 months after Bengaluru stampede The silence was grief
  • దాదాపు మూడు నెలల తర్వాత సోషల్ మీడియాలో స్పందించిన ఆర్సీబీ
  • జూన్ 4 తొక్కిసలాట ఘటనపై తీవ్ర దుఃఖంలో ఉన్నామన్న ఫ్రాంచైజీ
  • బాధిత అభిమానుల కోసం 'ఆర్సీబీ కేర్స్' అనే కొత్త కార్యక్రమం ప్రకటన
  • ఆ విషాదం మా గుండెల్ని పగలగొట్టిందని భావోద్వేగ పోస్ట్
ఐపీఎల్ టైటిల్ విజయోత్సవాల్లో జరిగిన ఘోర విషాదం తర్వాత దాదాపు మూడు నెలలుగా కొనసాగిస్తున్న మౌనానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తెరదించింది. అభిమానులను తీవ్రంగా కలిచివేసిన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఫ్రాంచైజీ, గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా 'ఆర్సీబీ కేర్స్' పేరిట ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

"గత మూడు నెలలుగా మా నిశ్శబ్దం అన్నది గైర్హాజరు కాదు, అది మా దుఃఖం. జూన్ 4వ తేదీ అన్నీ మార్చేసింది. ఆ రోజు మా హృదయాలు పగిలిపోయాయి. ఈ బాధలో నుంచే మా అభిమానులకు అండగా నిలబడాలనే ఆలోచనతో 'ఆర్సీబీ కేర్స్'కు ప్రాణం పోశాం. ఇది కేవలం ఓ స్పందన కాదు, మా అభిమానులను గౌరవించడానికి, వారి గాయాలను మాన్పడానికి మేం వేస్తున్న ఓ ముందడుగు. వేడుకతో కాదు, బాధ్యతతో మీ ముందుకు వస్తున్నాం" అని ఆర్సీబీ తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది.

జూన్ 4న ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల వేలాది మంది అభిమానులు వేడుకల కోసం గుమికూడారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 56 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్సీబీ యాజమాన్యాన్నే బాధ్యుల్ని చేయడంతో ఫ్రాంచైజీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

ఘటన జరిగిన వెంటనే సంతాపం ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత ఆర్సీబీ పాటించిన సుదీర్ఘ మౌనం విమర్శలకు దారితీసింది. ఈ ఘటన తర్వాత మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడంతో పాటు గాయపడిన వారికి వైద్య సహాయం అందించేందుకు ఫండ్ ఏర్పాటు చేశారు.

ఈ విషాదం కేవలం ప్రాణనష్టానికే పరిమితం కాలేదు, బెంగళూరులోని చారిత్రక చిన్నస్వామి స్టేడియం ప్రతిష్ఠను కూడా దెబ్బతీసింది. తొక్కిసలాట ఘటనపై జరిగిన విచారణలో స్టేడియం భద్రతా ప్రమాణాలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీని ఫలితంగా, వచ్చే నెలలో జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచ కప్ వేదికల జాబితా నుంచి బెంగళూరును తప్పిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. బెంగళూరుకు బదులుగా ముంబైలో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
RCB
Royal Challengers Bangalore
RCB Cares
IPL Title Celebration
Chinnaswamy Stadium
Fan Deaths
Stampede
Karnataka Government
Womens World Cup
Bangalore

More Telugu News