Donald Trump: విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్

US considers limiting student visa durations under Trump policy
  • అమెరికాలో ‘డ్యురేషన్ ఆఫ్ స్టే’ కుదించే ప్రతిపాదన
  • నాలుగేళ్లకు మించి ఉండకుండా కట్టడి చేయనున్న ట్రంప్
  • విద్యార్థుల వీసాల్లో కీలక మార్పులకు ప్రయత్నాలు
అమెరికాలో చదువుకుంటున్న, ఉన్నత చదువుల కోసం ఆ దేశానికి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వీసాలపై పలు ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా.. తాజాగా మరో కీలక సవరణకు ప్రతిపాదనలు చేసింది. విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఎక్కువ కాలం ఉండిపోకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా నిబంధనలకు సవరణ చేయనుంది. 

ప్రస్తుతం ఎఫ్‌-1, జే–1 వీసాలకున్న ‘డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టే’ వెసులుబాటును కుదించనున్నట్లు సమాచారం. ఈ వెసులుబాటు ప్రకారం.. విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటే అంతకాలం అమెరికాలో ఉండొచ్చు. ఈ ఫ్లెక్సిబుల్‌ స్టూడెంట్‌ వీసాలకు కూడా గడువు విధించేలా ‘పరిమిత కాల నివాస అనుమతి’తో కూడిన వీసాలను మంజూరు చేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. విదేశీ విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు, అమెరికన్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. 

అందుకే కొన్ని రకాల వీసాదారుల నివాస అనుమతులపై పరిమితి తీసుకొస్తున్నామని తమ నోటీసుల్లో పేర్కొంది. ఈ ప్రతిపాదనలను ఫెడరల్‌ రిజిస్ట్రీలో పబ్లిష్‌ చేయనున్నారు. ఆ తర్వాత ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణను తప్పించి తక్షణమే అమలు చేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశమూ లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పులు అమలులోకి వస్తే ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది.
 
ప్రతిపాదనలు..
  • ఎఫ్‌, జే వీసా హోల్డర్లు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లకు గరిష్ఠ కాల పరిమితి నాలుగేళ్లు
  • గ్రాడ్యుయేట్‌ స్థాయి ఎఫ్‌-1 విద్యార్థులు కోర్సు మధ్యలో ప్రోగ్రామ్‌లు మార్చుకుంటే ఆంక్షలు తప్పవు
  • ఎఫ్‌-1 విద్యార్థులు మరో వీసా కోసం ప్రయత్నించేందుకు ప్రస్తుతం ఉన్న గ్రేస్‌ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదింపు
  • ఐ-వీసాదారులు (మీడియా ప్రతినిధులు) 240 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత వీసా పరిమితిని మరో 240 రోజులకు పొడిగించుకోవచ్చు. చైనా మీడియా ప్రతినిధులకు అదనపు ఆంక్షలు
Donald Trump
US student visa
F1 visa
J1 visa
US immigration
International students
Student visa rules
Duration of stay
US education
Indian students in USA

More Telugu News