Uttar Pradesh: క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లి.. చెట్టెక్కి నోట్ల వర్షం కురిపించిన కోతి.. వైర‌ల్‌ వీడియో

Monkey Throws Cash From Tree in Uttar Pradesh Viral Video
  • బైక్ డిక్కీలోంచి రూ. 80 వేలున్న బ్యాగ్ చోరీ
  • చెట్టెక్కి నోట్ల వర్షం కురిపించిన వానరం
  • డబ్బు ఏరుకునేందుకు ఎగబడ్డ స్థానికులు
  • టీచర్‌కు తిరిగి దక్కింది రూ. 52 వేలు మాత్రమే
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ కోతి ఏకంగా రూ. 80 వేల నగదును చెట్టుపై నుంచి కిందకు వెదజల్లి, నోట్ల వర్షం కురిపించింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న జనం ఆ డబ్బును ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఔరయ్యా జిల్లా దోదాపూర్ గ్రామానికి చెందిన రోహితాశ్ చంద్ర అనే ప్రైవేట్ స్కూల్ టీచర్, ఓ భూమి రిజిస్ట్రేషన్ పని మీద స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తన వెంట తెచ్చిన రూ. 80 వేల నగదును ఓ సంచిలో పెట్టి బైక్ డిక్కీలో భద్రపరిచారు. ఆయన పనిలో నిమగ్నమై ఉండగా, ఎక్కడినుంచి వచ్చిందో ఓ కోతి బైక్ డిక్కీని తెరిచి ఆ డబ్బు సంచిని ఎత్తుకెళ్లింది.

వేగంగా సమీపంలోని చెట్టుపైకి ఎక్కిన ఆ కోతి, సంచిలో తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతికింది. ఆహారం ఏమీ కనిపించకపోవడంతో దానికి చిర్రెత్తుకొచ్చినట్లుంది. ఆ కోపంలో సంచిలోని రూ. 500 నోట్ల కట్టలను బయటకు తీసి గాలిలోకి విసిరేయడం మొదలుపెట్టింది. చెట్టుపై నుంచి నోట్లు రాలడం చూసిన అక్కడి జనం, వాటిని ఏరుకునేందుకు గుమిగూడారు.

ఈ గందరగోళం ముగిసేసరికి, బాధితుడు రోహితాశ్ చంద్రకు కేవలం రూ. 52,000 మాత్రమే ద‌క్కాయి. మిగిలిన రూ. 28,000 అక్కడున్న వారు ఏరుకోవడం, కోతి చించివేయడం జరిగిందని తెలుస్తోంది. తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని, తరచూ బ్యాగులు, ముఖ్యమైన పత్రాలు ఎత్తుకెళ్లి ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.

కాగా, 2021లో షాహాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ న్యాయవాది బ్యాగును ఎత్తుకెళ్లిన కోతి, దాదాపు లక్ష రూపాయలను గాలిలో వెదజల్లింది. చాలాసేపటి తర్వాత స్థానికుల సహాయంతో ఆయన చేతికి రూ. 95,000 వరకు అందాయి.
Uttar Pradesh
Monkey
monkey throws money
monkey cash bag
Auraiya district
Rohitash Chandra
Shahabad incident
viral video
money rain

More Telugu News