Scott Bessent: భారత్‌తో ఒప్పందం ఖాయం.. కానీ మమ్మల్ని ఆడిస్తున్నారు: యూఎస్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

We will come together says US Treasury Secretary on trade negotiations with India
  • భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆశాభావం
  • అయితే చర్చల్లో భారత్ నాన్చివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శ
  • ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య మంచి సంబంధాలున్నాయన్న స్కాట్ బెస్సెంట్
  • రష్యా చమురు కొని భారత్ లాభపడుతోందని మరోసారి ఆరోపణ
  • రూపాయి రిజర్వ్ కరెన్సీగా మారే అవకాశం లేదని వ్యాఖ్య
భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరడంపై అమెరికా ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేస్తూనే, మరోవైపు చర్చల విషయంలో భారత్ తీరుపై అసహనం ప్రదర్శించింది. ఇరు దేశాల మధ్య ఒప్పందం చివరికి ఖరారవుతుందని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, చర్చల ప్రక్రియలో భారత్ తమను ఆడిస్తోందని ఆయన ఆరోపించారు.

బుధవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ అయితే, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా, చివరికి మేమిద్దరం ఏకతాటిపైకి వస్తామని నేను భావిస్తున్నా" అని ఆయన అన్నారు.

అయితే, చర్చల విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. "ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక చాలా ముందుగానే భారత్ చర్చలకు వచ్చింది. మే, జూన్ నెలల్లోనే ఒప్పందం కుదురుతుందని నేను ఆశించాను. కానీ ఇప్పటికీ ఒప్పందం లేదు. వారు చర్చల ప్రక్రియను సాగదీస్తున్నారు" అని బెస్సెంట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకాలను విధించింది. దీంతో మొత్తం సుంకాలు 50 శాతానికి చేరాయి.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్ లాభపడుతోందన్న పాత ఆరోపణను బెస్సెంట్ మరోసారి గుర్తుచేశారు. గతంలో ఈ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ గట్టిగా బదులిచ్చిన విషయం తెలిసిందే. "భారత్ నుంచి చమురు కొనడం మీకు సమస్య అయితే, కొనకండి" అని ఆయన గత వారం స్పష్టం చేశారు.

ఇక బ్రిక్స్ దేశాలు రూపాయిలలో వాణిజ్యం జరపడంపై అడిగిన ప్రశ్నకు బెస్సెంట్ నవ్వేశారు. "రూపాయి రిజర్వ్ కరెన్సీగా మారుతుందని నేను ఆందోళన చెందడం లేదు" అని ఆయన కొట్టిపారేశారు. డీ-డాలరైజేషన్ తమ అజెండాలో లేదని గత నెలలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే.
Scott Bessent
US India trade deal
India US relations
Narendra Modi
Donald Trump
Indian Rupee
Randhir Jaiswal
Subrahmanyam Jaishankar
Russia oil
BRICS currency

More Telugu News