Google Maps: గూగుల్ మ్యాప్ ను నమ్మి... రాజస్థాన్‌లో విషాదం

Google Maps Accident in Rajasthan One Dead Three Missing
  • బనాస్ నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వ్యాన్
  • ఒక బాలిక మృతి, మరో ముగ్గురు గల్లంతు
  • ఐదుగురిని కాపాడిన పోలీసులు
  • చిత్తోర్‌గఢ్ జిల్లా రష్మి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోర్‌గఢ్ జిల్లా, రష్మి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భిల్వారా జిల్లాలోని సవాయి భోజ్‌ను దర్శించుకుని తిరిగి వస్తున్న ఒక కుటుంబం, గూగుల్ మ్యాప్ సూచించిన మార్గంలో ప్రయాణించడంతో వారి వ్యాన్ బనాస్ నదిలో కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో ఒక బాలిక మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గ్రామస్తుల సహకారంతో పోలీసులు ఐదుగురిని రక్షించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్‌సమంద్ జిల్లాకు చెందిన గదరి వర్గానికి చెందిన కుటుంబం విహార యాత్ర కోసం భిల్వారాలోని సవాయి భోజ్‌ను సందర్శించింది. తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్‌లో చూపిన మార్గాన్ని అనుసరించడంతో వారు సోమి–ఉప్రెడా మధ్యనున్న కల్వర్ట్ వద్దకు చేరుకున్నారు. అయితే, ఈ కల్వర్ట్ గత మూడు సంవత్సరాలుగా మూసివేయబడి ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బనాస్ నదికి పోటెత్తిన నీరు ఆ మార్గాన్ని కప్పివేసింది. ఈ విషయం తెలియని డ్రైవర్ వ్యాన్‌ను కల్వర్ట్‌ పైకి తీసుకెళ్లగా, వేగంగా వచ్చిన ప్రవాహానికి వ్యాన్ కొట్టుకుపోయింది.

ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్తులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పడవల సహాయంతో ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే, ఈ ఘటనలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గూగుల్ మ్యాప్‌లపై గుడ్డి నమ్మకం పెట్టుకోవడం ప్రమాదకరమని ఈ సంఘటన మరోసారి రుజువు చేసిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 
Google Maps
Rajasthan accident
Chittorgarh
Banas River
Road accident
Drowning
India news
Bhilwara
Savai Bhoj
Google Maps navigation

More Telugu News