Taylor Swift: టేలర్ స్విఫ్ట్ నిశ్చితార్థ ఉంగరం వెనుక మన గోల్కొండ కథ?.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ!

Taylor Swifts Engagement Ring May Have An Andhra Pradesh Connection
  • ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, ఎన్ఎఫ్ఎల్ స్టార్ ట్రావిస్ కెల్సీల నిశ్చితార్థం
  • సుమారు రూ. 4.8 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ప్రత్యేక ఆకర్షణ
  • ఉంగరంలోనిది పురాతన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వజ్రం
  • ఈ వజ్రం మూలాలు గోల్కొండ ప్రాంతానివి కావచ్చని ఊహాగానాలు
  • ఒకప్పుడు ప్రపంచ వజ్రాలకు గోల్కొండ గనులే ప్రధాన కేంద్రం
  • దీనిపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ ఆసక్తికరంగా మారిన చర్చ
ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, ప్రముఖ అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ట్రావిస్ కెల్సీ ఇటీవల తమ ప్రేమ బంధాన్ని నిశ్చితార్థంతో మరో మెట్టు ఎక్కించారు. ఈ వార్త వారి అభిమానులను ఆనందంలో ముంచెత్తుతుండగా, అందరి దృష్టి మాత్రం టేలర్ స్విఫ్ట్ వేలికి మెరుస్తున్న నిశ్చితార్థపు ఉంగరంపైనే పడింది. ఇప్పుడు ఆ ఉంగరంలోని వజ్రానికి మన తెలుగు నేలతో సంబంధం ఉందనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

రింగ్ ప్రత్యేకతలు.. విలువ ఎంతంటే?
ట్రావిస్ కెల్సీ తన ప్రియురాలి కోసం ప్రత్యేకంగా ఈ ఉంగరాన్ని న్యూయార్క్‌కు చెందిన ఆర్టిఫెక్స్ ఫైన్ జ్యువెలరీతో కలిసి స్వయంగా డిజైన్ చేయించారు. ఇందులో 7 నుంచి 10 క్యారెట్ల బరువున్న అరుదైన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వజ్రాన్ని 18 క్యారెట్ల బంగారంలో పొదిగారు. దీనిపై నిపుణులు అంచనా వేస్తున్న విలువ అక్షరాలా 5,50,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 4.8 కోట్లు). ఈ పురాతన డిజైన్, టేలర్ స్విఫ్ట్ అభిరుచికి తగినట్టుగా ఎంతో ప్రత్యేకంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

గోల్కొండతో సంబంధం ఏమిటి?
ఈ ఉంగరంలో ఉపయోగించిన 'ఓల్డ్ మైన్' కటింగ్ శైలి 18వ, 19వ శతాబ్దాలలో బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యుత్తమ వజ్రాలకు భారతదేశం, ముఖ్యంగా నేటి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న గోల్కొండ ప్రాంతం పెట్టింది పేరు. కొల్లూరు గనులు వీటికి ఎంతో ఫేమస్. కృష్ణా, గోదావరి నదీపరీవాహక ప్రాంతాలు, లోయల్లోని గనుల నుంచి వెలికితీసిన వజ్రాలు దాదాపు రెండు వేల సంవత్సరాల పాటు ప్రపంచ మార్కెట్‌ను శాసించాయి.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్, హోప్ డైమండ్ వంటి అపార విలువైన వజ్రాలు సైతం ఈ గనుల నుంచే లభించాయి. టేలర్ స్విఫ్ట్ ఉంగరంలోని వజ్రం కూడా ఆ కాలం నాటి 'ఓల్డ్ మైన్' కటింగ్‌తో ఉండటంతో అది గోల్కొండ గనుల నుంచి వచ్చిన వజ్రం అయి ఉండవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఇది కేవలం ఒక ఆసక్తికరమైన ఊహాగానంగానే మిగిలిపోయింది. ఏదేమైనా, ఒక అంతర్జాతీయ స్టార్ ధరించిన వజ్రం మూలాలపై జరుగుతున్న చర్చలో మన గోల్కొండ పేరు వినిపించడం విశేషం.
Taylor Swift
Travis Kelce
Taylor Swift engagement ring
Golconda diamonds
Old Mine cut diamond
Kohinoor diamond
Hope diamond
Indian diamonds

More Telugu News