Rekha Galbeliya: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. నాలుగో కాన్పు అని అబద్ధం!

Rajasthan Woman Rekha Galbeliya Delivers 17th Child at Age 55
  • రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వెలుగుచూసిన ఘటన
  • ఇప్పటికే 16 మందికి జన్మనిచ్చిన మహిళ.. వారిలో ఐదుగురు మృతి
  • తీవ్ర పేదరికంలో కుటుంబం.. అప్పుల ఊబిలో భర్త
  • ప్రభుత్వ పథకం కింద ఇల్లు మంజూరైనా దక్కని నివాసం
  • వైద్యులకు తప్పుడు సమాచారం ఇచ్చిన కుటుంబ సభ్యులు
వైద్య శాస్త్రానికే సవాల్ విసిరేలా ఓ వింత ఘటన రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌పూర్‌కు చెందిన 55 ఏళ్ల రేఖా గల్బేలియా మంగళవారం తన 17వ బిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వయసులో ప్రసవం జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

రేఖకు ఇదివరకే 16 మంది పిల్లలు పుట్టారు. అయితే వారిలో నలుగురు కుమారులు, ఒక కుమార్తె పుట్టిన కొద్దికాలానికే మరణించారు. ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల్లో ఐదుగురికి వివాహాలై, వారికి కూడా పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రేఖ కుమార్తె శీలా కల్బేలియా మాట్లాడుతూ "మేమంతా చాలా కష్టాలు పడ్డాం. మా అమ్మకు ఇంతమంది పిల్లలని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు" అని పేర్కొంది.

రేఖ కుటుంబం తీవ్ర పేదరికంలో జీవనం సాగిస్తోంది. పాత సామాన్లు అమ్ముకుని పూట గడుపుతున్నారు. వారికి సొంత ఇల్లు కూడా లేదు. పిల్లలను పోషించడం కోసం పడుతున్న కష్టాలను రేఖ భర్త కవ్రా కల్బేలియా వివరించాడు. "పిల్లల కడుపు నింపడానికి 20 శాతం వడ్డీకి అప్పులు చేయాల్సి వచ్చింది. లక్షల రూపాయలు తిరిగి చెల్లించినా, వడ్డీ ఇంకా తీరలేదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రభుత్వ పథకం కింద ఇల్లు మంజూరైనా అది తమకు దక్కలేదని ఆయన వాపోయాడు."పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరైనా, భూమి మా పేరు మీద లేకపోవడంతో నిరాశ్రయులుగానే ఉన్నాం. తిండికి, పెళ్లిళ్లకు, చదువులకు మా దగ్గర సరిపడా డబ్బుల్లేవు. ఈ సమస్యలు మమ్మల్ని ప్రతిరోజూ వేధిస్తున్నాయి" అని కవ్రా వివరించాడు.

మరోవైపు, ఆసుపత్రిలో చేర్పించినప్పుడు కుటుంబ సభ్యులు వైద్యులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఝాడోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గైనకాలజిస్ట్ రోషన్ దరంగి తెలిపారు. "రేఖను ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఇది ఆమె నాలుగో కాన్పు అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ తర్వాత ఇది 17వ కాన్పు అని తేలింది" అని ఆయన పేర్కొన్నారు.
Rekha Galbeliya
Rajasthan woman
17th child birth
Udaipur
PM Awas Yojana
poverty
health
Jhadol Community Health Center

More Telugu News