Benjamin Dekel: వైద్యరంగంలో కీలక ముందడుగు.. ప్రయోగశాలలో కిడ్నీ నమూనా అభివృద్ధి

Benjamin Dekel Develops Lab Grown Kidney Model
  • ప్రయోగశాలలో కిడ్నీ నమూనాను సృష్టించిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు
  • 34 వారాలకు పైగా మనుగడ సాగించిన వైనం
  • దెబ్బతిన్న కిడ్నీలను బాగుచేసే శక్తి ఈ నమూనా స్రావాలకు ఉందని వెల్లడి
  • కిడ్నీ వ్యాధుల అధ్యయనం, మందుల పరీక్షలకు మార్గం సుగమం
  • పునరుత్పత్తి వైద్యంలో కీలక ముందడుగుగా పరిశోధన
  • త్వరలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు
వైద్య రంగంలో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అద్భుత విజయాన్ని సాధించారు. ప్రయోగశాలలో మానవ కిడ్నీ నమూనాను (ఆర్గనాయిడ్) విజయవంతంగా అభివృద్ధి చేశారు. సాధారణంగా ఇలాంటి నమూనాలు నాలుగు వారాలకు మించి మనుగడ సాగించలేవు. కానీ, తాజా పరిశోధనలో ఏకంగా 34 వారాలకు పైగా ఈ కిడ్నీ నమూనా జీవించి ఉండటం ఒక రికార్డుగా నిలిచింది. ఈ ఆవిష్కరణ కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

ఇజ్రాయెల్‌లోని షెబా మెడికల్ సెంటర్, టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ఈ ఘనత సాధించింది. కిడ్నీ మూలకణాల నుంచి త్రీడీ విధానంలో ఈ సింథటిక్ కిడ్నీ ఆర్గనాయిడ్‌ను పెంచారు. గర్భంలో శిశువు కిడ్నీలు 34 వారాల వరకు ఎలా పరిపక్వం చెందుతాయో, అదే ప్రక్రియను ల్యాబ్‌లో అనుకరించడం ద్వారా దీనిని సాధించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను ప్రతిష్టాత్మక 'ది ఎంబో జర్నల్'లో ప్రచురించారు.

ఈ పరిశోధనలోని అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఈ నమూనాను నేరుగా రోగి శరీరంలో అమర్చడం దీని లక్ష్యం కాదు. షెబా చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని స్టెమ్ సెల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ బెంజమిన్ డెకెల్ ప్రకారం ఈ కిడ్నీ ఆర్గనాయిడ్ నుంచి వెలువడే ప్రత్యేకమైన జీవాణువులు(బయోమాలిక్యూల్స్) దెబ్బతిన్న కిడ్నీలను బాగుచేయగలవని భావిస్తున్నారు. అంటే, పూర్తి అవయవ మార్పిడి అవసరం లేకుండా, ఈ స్రావాల ద్వారానే చికిత్స అందించే అవకాశం ఉందని ఆయన వివరించారు.

ఈ ఆవిష్కరణ కేవలం చికిత్సకే పరిమితం కాదు. కిడ్నీ వ్యాధులు ఎలా వస్తాయి? వాటి పురోగతి ఎలా ఉంటుందనే విషయాలను అధ్యయనం చేయడానికి ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో మందుల విష ప్రభావాన్ని పరీక్షించడానికి, పుట్టుకతో వచ్చే కిడ్నీ లోపాలను అర్థం చేసుకోవడానికి కూడా ఇవి దోహదపడతాయి. "అభివృద్ధి దశలో తలెత్తే ఒక చిన్న సమస్య క్లినిక్‌లో కనిపించే కిడ్నీ వ్యాధులకు ఎలా దారితీస్తుందో మేము ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. ఇది వినూత్న చికిత్సల అభివృద్ధికి సహాయపడుతుంది" అని డాక్టర్ డెకెల్ తెలిపారు.

అయితే, ఈ పరిశోధన పూర్తిస్థాయిలో రోగులకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కిడ్నీలను బాగుచేసే కణాలు, అణువులను కచ్చితంగా గుర్తించిన తర్వాతే మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని వారు పేర్కొన్నారు. ఏదేమైనా, పునరుత్పత్తి వైద్య (రీజనరేటివ్ మెడిసిన్) రంగంలో ఈ పరిశోధన ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Benjamin Dekel
Kidney organoid
Artificial kidney
Kidney disease
Sheba Medical Center
Tel Aviv University
Regenerative medicine
Kidney research
Kidney failure
Biomolecules

More Telugu News