Ganesh Chaturthi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ వినాయక చవితి శుభాకాంక్షలు

PM Modi greets nation on Ganesh Chaturthi wishes for everyones happiness peace
  • దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు
  • అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం కలగాలని ప్రధాని ఆకాంక్ష
  • శుభాకాంక్షలు చెప్పిన కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్
  • ఎక్స్ వేదికగా విషెస్‌ తెలిపిన ప్రముఖులు
విఘ్నాలను తొలగించి, విజ్ఞానాన్ని ప్రసాదించే గణనాథుడి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. "అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భక్తిశ్రద్ధలతో నిండిన ఈ పవిత్రమైన పర్వదినం ప్రతిఒక్కరి జీవితంలో శుభాలను తీసుకురావాలి. తన భక్తులందరికీ సంతోషం, శాంతి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని గజాననుడిని ప్రార్థిస్తున్నాను. గణపతి బప్పా మోరియా!" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో గణపతి ఆశీస్సులతో సుఖసమృద్ధులు వెల్లివిరియాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, విఘ్నహర్త అయిన గణేశుడి దయతో దేశంలో ఐక్యత, శాంతి, అభివృద్ధి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం రాష్ట్ర ప్రజలకు, భక్తులకు చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.

ఇక‌, ప్రజలు తమ ఇళ్లలో, బహిరంగ మండపాల్లో అందంగా అలంకరించిన వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పది రోజుల పూజల అనంతరం నిమజ్జనంతో ఈ వేడుకలు ముగుస్తాయి.
Ganesh Chaturthi
PM Modi
Vinayaka Chavithi
Indian Festivals
Hindu Festival
Amit Shah
Yogi Adityanath
India Celebrations
Ganesha
Lord Ganesha

More Telugu News