Annamalai: అన్నామలైకి చేదు అనుభవం... స్టేజ్‌పై షాకిచ్చిన మంత్రి కుమారుడు

Annamalai Faced Rejection From Minister Son On Stage
  • చేతుల మీదుగా మెడల్ మెడలో వేసుకోవడానికి నిరాకరించిన డీఎంకే మంత్రి కొడుకు
  • మెడలో కాకుండా పతకాన్ని చేతిలోకి తీసుకున్న సూర్యా రాజా బాలు
  • రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల బహుమతి ప్రదానోత్సవంలో ఈ ఘటన
తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వైరం మరోసారి బహిరంగంగా వ్యక్తమైంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై చేతుల మీదుగా మెడల్ మెడలో వేయించుకోవడానికి రాష్ట్ర మంత్రి కుమారుడు నిరాకరించిన సంఘటన చర్చనీయాంశమైంది. ఈ ఘటన రెండు వారాల క్రితం గవర్నర్‌కు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసింది.

51వ రాష్ట్ర స్థాయి షూటింగ్ క్రీడల బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా అన్నామలై హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు ఆయన పతకాలు అందిజేస్తుండగా, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా కుమారుడు, విజేత అయిన సూర్యా రాజా బాలు వంతు వచ్చింది. అన్నామలై పతకాన్ని అతడి మెడలో వేయబోగా, సూర్యా సున్నితంగా తిరస్కరించి, నేరుగా చేతిలోకి తీసుకున్నారు.

ఇలాంటి సంఘటనే రెండు వారాల క్రితం తిరునల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ యూనివర్సిటీ 32వ స్నాతకోత్సవంలో చోటు చేసుకుంది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా తీసుకోవడానికి జీన్ జోసెఫ్ అనే విద్యార్థిని నిరాకరించారు. డీఎంకే నేత ఎం రాజన్ భార్య అయిన ఆమె, వేదికపై గవర్నర్‌ను దాటి వెళ్లి వైస్ ఛాన్సలర్ నుంచి తన డిగ్రీని అందుకున్నారు. గవర్నర్ 'తమిళ, తమిళనాడు వ్యతిరేక వైఖరి'కి నిరసనగానే తాను అలా చేసినట్లు ఆమె తెలిపారు. "ద్రావిడ మోడల్‌పై నాకు నమ్మకం ఉంది, అందుకే వీసీ నుంచి పట్టా తీసుకున్నాను" అని ఆమె వివరించారు.

అప్పట్లో ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అన్నామలై, అది "ప్రచారం కోసం డీఎంకే సభ్యులు ఆడిన నీచమైన నాటకం" అని విమర్శించారు. "పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోకి నాసిరకం రాజకీయాలను తీసుకురావద్దు" అని ఆయన హెచ్చరించడం గమనార్హం.
Annamalai
Tamil Nadu
TRB Raja
Surya Raja Balu
shooting competition
Tamil Nadu politics
DMK

More Telugu News