Anant Ambani: అంబానీ 'వంటారా'పై జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలో సిట్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశం

Supreme Court Orders SIT Probe into Anant Ambanis Vantara
  • అనంత్ అంబానీ 'వంటారా' కేంద్రంపై తీవ్ర ఆరోపణలు
  • విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
  • జంతువుల అక్రమ రవాణా, నిర్బంధంపై దర్యాప్తునకు ఆదేశం
  • సెప్టెంబర్ 12లోగా నివేదిక సమర్పించాలని సుప్రీం గడువు
  • దర్యాప్తు కేవలం వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు మాత్రమేనన్న సుప్రీంకోర్టు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గుజరాత్‌లో నిర్వహిస్తున్న 'వంటారా' వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

వంటారా కేంద్రంలో జంతువులను అక్రమంగా నిర్బంధిస్తున్నారని, దేశ విదేశాల నుంచి వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇలాంటి పిటిషన్లను తోసిపుచ్చుతామని, కానీ ఈ ఆరోపణలు చట్టబద్ధమైన సంస్థల పనితీరుపైనే సందేహాలు రేకెత్తిస్తున్నందున, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు అవసరమని కోర్టు అభిప్రాయపడింది.

జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ఈ సిట్‌లో ఉత్తరాఖండ్, తెలంగాణ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్‌రాలే, సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అనీశ్ గుప్తా సభ్యులుగా ఉంటారు. దేశవిదేశాల నుంచి ఏనుగులు సహా ఇతర జంతువులను ఎలా సంపాదించారు, వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972, అంతర్జాతీయ నిబంధనలను పాటించారా? లేదా? జంతువులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలపై ఈ సిట్ దర్యాప్తు చేయనుంది.

ఈ దర్యాప్తు కేవలం వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు మాత్రమేనని, దీనివల్ల వంటారా సంస్థపై గానీ, ఇతర ప్రభుత్వ సంస్థల పనితీరుపై గానీ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 12వ తేదీలోగా తమ నివేదికను సమర్పించాలని సిట్‌ను ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన 'మాధురి' అనే ఏనుగును వంటారాకు తరలించడంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన కొన్ని రోజులకే ఈ పిటిషన్లు దాఖలు కావడం గమనార్హం. ఆలయాలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న ఏనుగులను, ఇతర అంతరించిపోతున్న జీవులను అక్రమంగా వంటారాకు తరలిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. అయితే, న్యాయస్థానం ఆదేశాల మేరకే 'మాధురి'ని తమ కేంద్రానికి తరలించామని, జంతువులకు సంరక్షణ కల్పించడమే తమ బాధ్యత అని వంటారా యాజమాన్యం గతంలో ఒక ప్రకటనలో తెలిపింది.
Anant Ambani
Vantara
Reliance
Justice Chalameshwar
Wildlife Sanctuary
Animal Cruelty
Supreme Court
SIT Investigation
Animal Trafficking
Gujarat

More Telugu News