Vangalapudi Anitha: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు .. మంత్రులు అనిత, అచ్చెన్న కీలక సూచనలు

Vangalapudi Anitha reviews heavy rains in Uttarandhra
  • అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా కురుస్తున్న వర్షాలు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్న హోంమంత్రి అనిత
  • శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ముమ్మరంగా కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు పడుతుండటంతో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, అవసరమైతే తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అంతేకాక, ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లు వంటివి వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వర్షపాతం పెరుగుతుండటంతో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డితో ఆయన ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని జలవనరుల శాఖ అధికారులకు సూచించారు.

వ్యవసాయ శాఖ అధికారులతో కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 
Vangalapudi Anitha
Andhra Pradesh rains
Uttarandhra floods
Atchannaidu
Srikakulam
Visakhapatnam
Vizianagaram
Cyclone alert
AP weather
Heavy rainfall

More Telugu News