AP High Court: ముగ్గురు ఏపీ హైకోర్టు జడ్జిల బదిలీ

AP High Court Three Judges Transferred by Supreme Court Collegium
  • సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం
  • జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ డి రమేశ్, జస్టిస్ శుభేందు సమంతలు మళ్లీ ఏపీ హైకోర్టుకు
దేశంలోని హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫారసు చేయగా, వీరిలో ముగ్గురు న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రానున్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలో నిన్న సమావేశమైన కొలీజియం, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్, కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శుభేందు సమంతలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరి బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. వీరు ముగ్గురు గతంలో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తులుగా సేవలు అందించిన వారే కావడం గమనార్హం. మరో విశేషం ఏమిటంటే వీరిలో ఇద్దరు న్యాయమూర్తులు ఏపీకి చెందిన వారు కావడం.

జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్: విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందినవారు. విశాఖపట్నంలోని ఎంవీపీ లా కళాశాలలో న్యాయ విద్య పూర్తి చేసిన ఆయన, 1988 నుంచి న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 2002లో జిల్లా సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు. 2015 నుంచి 2018 వరకు ఉమ్మడి హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్‌గా సేవలందించారు. 2019 లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, తర్వాత గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఏపీ హైకోర్టుకు రానున్నారు.

జస్టిస్ డి. రమేశ్: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలోని కమ్మపల్లికి చెందినవారు. నెల్లూరులోని వీఆర్ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన, 1990లో న్యాయవాదిగా చేరారు. ప్రభుత్వ న్యాయవాదిగా, స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించిన తర్వాత 2020లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆయన తిరిగి ఏపీకి బదిలీ అయ్యారు.

జస్టిస్ శుభేందు సమంత: పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. కోల్‌కతా యూనివర్సిటీలో న్యాయ విద్యను పూర్తిచేసి తమ్లుక్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. తర్వాత న్యాయాధికారిగా ఎంపికై పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థాన జడ్జిగా, కోల్‌కతా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేసిన ఆయన, 2022లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
AP High Court
High Court Judges Transfer
Manavendranath Roy
D Ramesh
Shubhendu Samanta
Supreme Court Collegium
Andhra Pradesh High Court
Judges Transfer List
High Court Transfers India
Justice BR Gavai

More Telugu News