Andhra Pradesh Weather: బంగాళాఖాతంలో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం

AP Weather Alert Rains Predicted Due to Low Pressure
  • వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశం
  • ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
  • కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలిపింది. రానున్న 48 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఈ వివరాలను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం చురుకుగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఇది విస్తరించి ఉందని వివరించారు. ఈ ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని స్పష్టం చేశారు.

ఈ వాతావరణ మార్పుల వల్ల మంగళవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో, కోస్తాంధ్రలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Andhra Pradesh Weather
Bay of Bengal
Low Pressure Area
North Andhra districts
Rainfall alert
Weather forecast
AP Disaster Management
Heavy rains
Srikakulam
Visakhapatnam

More Telugu News