Harsh Goenka: టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ చేస్తే.. కంపెనీ పని అయిపోయినట్టేనా?... హర్ష్ గోయెంకా ట్వీట్‌తో కొత్త చర్చ

Harsh Goenka Tweet Sparks Debate on Team India Jersey Sponsorship
  • టీమిండియా జెర్సీ స్పాన్సర్ డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు
  • కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు కారణంగా మధ్యలోనే డీల్‌కు బ్రేక్
  • టీమిండియా స్పాన్సర్‌షిప్‌పై పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సంచలన ట్వీట్
  • భారత జట్టుకు స్పాన్సర్‌షిప్ అంటే బ్రాండ్లకు పెద్ద పరీక్ష అంటూ వ్యంగ్యం
  • గత స్పాన్సర్లు సహారా, బైజూస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వైనం
భారత క్రికెట్ జట్టు జెర్సీని స్పాన్సర్ చేస్తే ఆ కంపెనీల పని అయిపోయినట్టేనా? గతంలో స్పాన్సర్లుగా వ్యవహరించిన సంస్థల పరిస్థితి చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోందని చర్చ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుతోంది. ఇదే విషయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్ గోయెంకా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది.

"మీ బ్రాండ్ మనుగడ సత్తాను పరీక్షించుకోవాలనుకుంటున్నారా? అయితే స్టాక్ మార్కెట్‌ను పక్కనపెట్టండి. భారత క్రికెట్ జట్టు జెర్సీకి స్పాన్సర్‌గా నిలవండి" అంటూ ఆయన తన ట్వీట్‌లో వ్యంగ్యంగా పేర్కొన్నారు. గోయెంకా చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజమని, గత అనుభవాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు.

టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న ‘డ్రీమ్ 11’తో బీసీసీఐ తన ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకోవడమే ఈ చర్చకు కారణమైంది. పార్లమెంట్‌లో కొత్తగా ఆమోదం పొందిన ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల కాలానికి గాను రూ.358 కోట్ల విలువైన ఈ ఒప్పందం అర్ధాంతరంగా ముగిసిపోయింది.

డ్రీమ్ 11 ఉదంతంతో గత స్పాన్సర్ల పరిస్థితి మరోసారి చర్చకు వచ్చింది. 2001 నుంచి భారత జట్టుకు స్పాన్సర్లుగా వ్యవహరించిన సహారా, స్టార్, ఒప్పో, బైజూస్ వంటి దిగ్గజ సంస్థలు.. స్పాన్సర్‌షిప్ తర్వాత తీవ్రమైన ఆర్థిక లేదా చట్టపరమైన సమస్యల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా, ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ దాదాపు పతనమయ్యే స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ అనేది బ్రాండ్లకు అదృష్టమో, దురదృష్టమో అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. 

Harsh Goenka
Team India
Indian Cricket Team
BCCI
Dream 11
Sponsorship
Byjus
Sahara
OPPO
Online Gaming Bill

More Telugu News