Srisailam: సీతాఫలాలు కోసుకుందామని అడవిలోకి తీసుకెళ్లి... భార్యను హత్య చేసిన భర్త

Telangana Man Kills Wife over Suspected Infidelity
  • రాంగ్ నంబర్ ద్వారా పరిచయం... ఆపై ప్రేమ వివాహం
  • భార్య ఫోన్ కాల్స్‌పై అనుమానంతో తరచూ గొడవలు
  • సోమశిలకు వెళదామని చెప్పి అడవిలోకి తీసుకెళ్లిన భర్త
  • గొంతు నులిమి, కత్తితో పొడిచి దారుణ హత్య
  • పెట్రోల్ పోసి నిప్పంటించి, పోలీసుల ఎదుట లొంగుబాటు
  • నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన
భార్య ఎవరితోనో తరచూ ఫోన్‌లో మాట్లాడుతోందన్న అనుమానం ఓ భర్తను కిరాతకుడిగా మార్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే అత్యంత దారుణంగా హతమార్చాడు. సోమశిలకు వెళదామని నమ్మించి అడవిలోకి తీసుకెళ్లి, గొంతు నులిమి, కత్తితో పొడిచి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలంకు, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూర్‌కు చెందిన శ్రావణి (27)కి రాంగ్ నంబర్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి 2014లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అయితే, పెళ్లయిన కొంతకాలానికే శ్రావణి తన అక్క భర్తతో వెళ్లిపోయింది. ఏడాది క్రితం తిరిగి రావడంతో శ్రీశైలం ఆమెను మళ్లీ చేరదీశాడు.

అయితే అప్పటి నుంచి శ్రావణి ప్రవర్తనలో మార్పు రాలేదని, ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం, చాటింగ్ చేయడం శ్రీశైలం గమనించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. పద్ధతి మార్చుకోవాలని భర్త ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినకపోవడంతో, ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

పథకం ప్రకారం, సోమశిలకు వెళ్దామని చెప్పి శ్రావణిని బైక్‌పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ సమీపంలో సీతాఫలం పండ్లు ఉన్నాయని చెప్పి ఆమెను అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చున్నీతోనే మెడకు బిగించి గొంతు నులిమాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు.

మరోవైపు, తన కూతురు కనిపించడం లేదంటూ శ్రావణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ మొదలుపెట్టిన కొద్దిసేపటికే శ్రీశైలం తానే పోలీసుల ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Srisailam
Sravani murder
Nagarkurnool crime
wife killed husband
любовь брак
extramarital affair
Andhra Pradesh news
Telangana crime news
marital dispute
Somashila

More Telugu News