Revanth Reddy: 20 ఏళ్ల తరువాత ఓయూకు సీఎం... సమస్యల పరిష్కారంపై విద్యార్థుల ఆశలు

Revanth Reddy to Address Osmania University Students on Reforms
  • రెండు దశాబ్దాల తర్వాత ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
  • విద్యా సంస్కరణలపై ప్రసంగించనున్న ముఖ్యమంత్రి
  • వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
  • భూకబ్జాలు, విద్యార్థి సంఘ ఎన్నికల నిర్వహణపై విద్యార్థుల డిమాండ్
  • సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థి లోకం
తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోకి సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుపెట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (25న) ఓయూను సందర్శించి, రాష్ట్ర విద్యారంగంలో చేపట్టనున్న సంస్కరణలపై కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ చారిత్రక పర్యటన నేపథ్యంలో, ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారంపై విద్యార్థులు గంపెడాశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తమ గోడును వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.

యూనివర్సిటీలో అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల భర్తీ జరిగి దశాబ్దాలు గడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క పోస్టును కూడా భర్తీ చేయకపోవడంతో వర్సిటీ అకడమిక్ పరంగా తీవ్రంగా దెబ్బతింటోంది. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 1,400 టీచింగ్ పోస్టులకు గాను వెయ్యికి పైగా ఖాళీగా ఉన్నాయి. 2,300 నాన్-టీచింగ్ పోస్టులు కూడా భర్తీకి నోచుకోలేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇంజనీరింగ్ విభాగంలో ఒక్క శాశ్వత ప్రొఫెసర్ కూడా లేరని, కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉర్దూ విభాగంలో 19 మందికి గాను నలుగురు, సైకాలజీ, ఫిలాసఫీ విభాగాల్లో కేవలం ఇద్దరేసి ప్రొఫెసర్లు ఉండటం గమనార్హం.

మరోవైపు, వందల ఎకరాల వర్సిటీ భూములు అన్యాక్రాంతం కావడం మరో పెద్ద సమస్యగా మారింది. నిజాం హయాంలో 2,200 ఎకరాలతో ఏర్పాటైన వర్సిటీ భూమి, ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1950 నాటికి 1,627 ఎకరాలకు పరిమితమైంది. ప్రస్తుతం 251 ఎకరాలకు పైగా భూమి వివాదాల్లో ఉంది. కోర్టు విచారణలో సరైన పత్రాలు సమర్పించడంలో వర్సిటీ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే భూసర్వే చేసి, హద్దులు నిర్ణయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

వీటితో పాటు, ప్రజాస్వామ్యానికి వేదికగా నిలిచిన విద్యార్థి సంఘం ఎన్నికలను పునరుద్ధరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఓయూ నుంచి ఎదిగిన ఎందరో నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని గుర్తుచేస్తూ, ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం పర్యటన ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం చూపుతుందనే ఆశాభావంతో విద్యార్థి లోకం ఎదురుచూస్తోంది.
Revanth Reddy
Osmania University
OU
Telangana
University Land Encroachment
Student Union Elections
Teaching Posts
Non-Teaching Posts
Higher Education
University Issues

More Telugu News