Indian Tourists: పాక్‌తో దోస్తీ.. తుర్కియే, అజర్‌బైజాన్‌లకు భారత పర్యాటకుల గట్టి షాక్!

Not Just Turkey Indian Tourists Shun Azerbaijan Too
  • తుర్కియే, అజర్‌బైజాన్‌లకు భారీగా తగ్గిన భారత పర్యాటకులు
  • పాకిస్థాన్‌కు మద్దతివ్వడమే ప్రధాన కారణంగా వెల్లడి
  • అజర్‌బైజాన్‌కు పర్యాటకుల సంఖ్యలో 66 శాతం క్షీణత
  • తుర్కియే పర్యటనల్లోనూ దాదాపు సగానికి సగం కోత
పాకిస్థాన్‌కు బాహాటంగా మద్దతు పలకడం తుర్కియే, అజర్‌బైజాన్ దేశాలకు పర్యాటక రంగంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 'ఆపరేషన్ సిందూర్' అనంతరం ఈ రెండు దేశాలకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. భారతీయుల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకత కారణంగా ఈ దేశాల పర్యాటక గణాంకాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.

తాజా గణాంకాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో అజర్‌బైజాన్‌కు వెళ్లిన భారతీయుల సంఖ్య ఏకంగా 66 శాతం మేర క్షీణించింది. 2024 జూన్‌లో 28,315 మంది భారతీయులు అజర్‌బైజాన్‌ను సందర్శించగా, ఈసారి ఆ సంఖ్య కేవలం 9,934కు పరిమితమైంది. అంతకుముందు మే నెలలో 23,000 మందికి పైగా భారతీయులు ఆ దేశానికి వెళ్లడం గమనార్హం. దీనికి తోడు, అజర్‌బైజాన్ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో జమ్మూకశ్మీర్ మ్యాప్‌ను తప్పుగా చూపిస్తూ, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), అక్సాయ్ చిన్‌లను భారత్‌లో భాగంగా చూపించలేదని కూడా వెల్లడైంది.

అజర్‌బైజాన్ బాటలోనే తుర్కియే కూడా పర్యాటకంలో నష్టాలను చవిచూస్తోంది. ఈ ఏడాది జులైలో కేవలం 16,244 మంది భారతీయులు మాత్రమే తుర్కియేను సందర్శించారు. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 28,875గా ఉంది. అంటే దాదాపు 44 శాతం క్షీణత నమోదైంది. మే నెలతో పోలిస్తే జులై నాటికి పర్యాటకుల సంఖ్య సగానికి సగం పడిపోయింది.

'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్ సైన్యం తుర్కియేలో తయారైన డ్రోన్లను ఉపయోగించినట్లు తేలడంతో భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనికి తోడు దౌత్యపరంగా కూడా తుర్కియే, అజర్‌బైజాన్‌లు పాక్‌కే మద్దతుగా నిలిచాయి. గత మే నెలలో పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ అజర్‌బైజాన్‌లో పర్యటించి మద్దతుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. దీంతో భారత్‌లో 'బాయ్‌కాట్ తుర్కియే' వంటి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మేక్‌మైట్రిప్, ఈజ్‌మైట్రిప్ వంటి ప్రముఖ ట్రావెల్ కంపెనీలు కూడా ఈ రెండు దేశాలకు వెళ్లే పర్యాటక ప్యాకేజీలను నిరుత్సాహపరుస్తున్నట్లు సమాచారం.


Indian Tourists
Turkey tourism
Azerbaijan tourism
Boycott Turkey
Boycott Azerbaijan
Operation Sindoor
India Pakistan relations
Jammu Kashmir map
Travel packages decline
MakeMyTrip EaseMyTrip

More Telugu News