CPI Narayana: కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టంపై సీపీఐ నారాయణ స్పందన

CPI Narayana Reacts on Central Government New Act
  • వ్యతిరేకంగా ఉన్న సీఎంలను బెదిరించడానికే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టమన్న సీపీఐ నారాయణ
  • ప్రజాప్రతినిధులు జైలుకు వెళ్లినట్లయితే వారిని పదవీచ్యుతులను చేయడం ఒక దుర్మార్గ చర్య అన్న నారాయణ
  • చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ కేంద్రానికి సాగిలపడుతున్నారన్న నారాయణ
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన చట్టంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులను బెదిరించడానికే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తోందని ఆయన విమర్శించారు. ప్రజాప్రతినిధులు జైలుకు వెళ్లినట్లయితే వారిని పదవీచ్యుతులను చేయడం ఒక దుర్మార్గ చర్య అని ఆయన ధ్వజమెత్తారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న ప్రారంభమైన సీపీఐ రాష్ట్ర మహాసభల్లో నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్డీయే ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో మోసం చేస్తోందని నారాయణ విమర్శించారు. "ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఉన్నవారినే తొలగిస్తున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు.

జీఎస్టీ వసూళ్లు లక్షల కోట్లలో జరుగుతున్నాయని చెబుతున్న కేంద్రం.. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపుతూ, కార్పొరేట్‌ శక్తులకు లబ్ధి కలిగిస్తున్నదని ఆరోపించారు. చెప్పులపై పన్నును 5 శాతం నుంచి 12–18 శాతాలకు పెంచడం సామాన్యులను దోచుకునే చర్యగా అభివర్ణించారు.

చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ కేంద్రానికి సాగిలపడుతున్నారని మండిపడ్డారు. పలాస పోర్టు కోసం కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తంగా 6 వేల ఎకరాలు ఇచ్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అమరావతి రాజధాని పేరుతో మరో 45 వేల ఎకరాలు తీసుకోవాలని చూస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. "లక్ష ఎకరాల్లో రాజధాని ఎక్కడైనా ఉందా?" అంటూ నారాయణ ప్రశ్నించారు. 
CPI Narayana
Narayana CPI
CPI State Maha Sabhalu
AP Politics
BJP Government
Central Government Act
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News