Cyber Fraud: ట్రాఫిక్ చలానా పేరుతో సైబ‌ర్‌ మోసం.. రూ. 1.36ల‌క్ష‌లు మాయం

Cyber Fraud Man Loses Rs 136 Lakh in Traffic Challan Scam
  • గుంటూరు జిల్లా దుగ్గిరాల మండ‌లం వీర్ల‌పాలేంలో ఘ‌ట‌న
  • ఏపీకే ఫైల్‌లో ట్రాఫిక్ చ‌లానా పేరిట కేటుగాళ్ల‌ మెసేజ్
  • ఆ లింక్‌ను క్లిక్ చేయ‌గానే యాప్ డౌన్‌లోడ్‌
  • ఆ త‌ర్వాత ప‌లు ద‌ఫాల్లో బాధితుడి ఖాతా నుంచి రూ. 1.36ల‌క్ష‌లు మాయం

ట్రాఫిక్ చలానా పేరుతో సైబ‌ర్ మోస‌గాళ్లు ఓ వ్య‌క్తిని బోల్తా కొట్టించి ఏకంగా రూ. 1.36లక్ష‌లు కాజేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండ‌లం వీర్ల‌పాలేంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. స్థానికంగా హోట‌ల్ నిర్వ‌హిస్తున్న నిరంజ‌న్ రెడ్డి మొబైల్ ఫోన్‌కు శుక్ర‌వారం రాత్రి ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు మీ వాహ‌నంపై చ‌లానా ఉంద‌ని, వెంట‌నే చెల్లించాలంటూ రాష్ట్ర పోలీసులు పంపిన‌ట్లుగా ఏపీకే ఫైల్‌లో మెసేజ్ వ‌చ్చింది. 

పూర్తి స‌మాచారం కోసం అందులో ఇచ్చిన‌ లింక్‌ను క్లిక్ చేయాల‌ని ఉంది. ఆ లింక్‌ను క్లిక్ చేయ‌డంతో ఓ యాప్ డౌన్‌లోడ్ అయింది. దాన్ని తెర‌వ‌గా.. ఓటీపీ అడిగింది. దాంతో అనుమానం వ‌చ్చి నిరంజ‌న్ రెడ్డి ఆ ప్ర‌క్రియ‌ను మ‌ధ్య‌లోనే ఆపేశారు. కానీ, శ‌నివారం ఉద‌యం ఆయ‌న క్రెడిట్ కార్డు నుంచి రూ. 61వేలు ఒక‌సారి,  రూ. 32వేలు మ‌రోసారి డ‌బ్బులు తీసుకున్న‌ట్లు సందేశాలు వ‌చ్చాయి. 

దాంతో అప్ర‌మ‌త్త‌మై కార్డును బ్లాక్ చేయించారు. కానీ, ఆ ప్ర‌క్రియ ముగిసేలోపే మ‌రో రూ. 20, 999 తీసుకున్న‌ట్లు సందేశం వ‌చ్చింది. ఇలా ప‌లు ద‌ఫాలుగా రూ. 1.36ల‌క్ష‌లు కాజేశారు. ఆ డ‌బ్బుతో ఆన్‌లైన్‌లో మొబైల్స్ కొనుగోలు చేసిన‌ట్లు నిరంజ‌న్ రెడ్డికి మెసేజ్‌లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. విచార‌ణ చేపట్టిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ వ్య‌క్తి ఈ నేరానికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు చేస్తున్నారు.   
Cyber Fraud
Traffic Challan
Guntur
Duggirala
Cyber Crime
Andhra Pradesh Police
Online Scam
Maharashtra

More Telugu News