Krishnam Raju: నిత్య పెళ్లి కొడుకు కానిస్టేబుల్ సస్పెండ్.. పోక్సో కేసు నమోదు

Constable Krishnam Raju Suspended Over Four Marriages  Case Filed
  • ముగ్గురిని పెళ్లాడిన కానిస్టేబుల్‌పై వేటు
  • బాధితుల్లో 16 ఏళ్ల మైనర్ బాలిక
  • సూర్యాపేట జిల్లా కానిస్టేబుల్ కృష్ణంరాజు నిర్వాకం
  • నాలుగో పెళ్లికి సిద్ధమవుతుండగా వెలుగులోకి వ్యవహారం
  • విచారణ జరిపి సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ
వరుస వివాహాలు చేసుకుంటూ, చివరకు ఓ మైనర్ బాలికను సైతం పెళ్లాడిన కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ విషయంపై విచారణ జరిపిన అనంతరం సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, తాజాగా అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.

ఈ దుశ్చర్యకు పాల్పడిన కానిస్టేబుల్ చివ్వెంల మండలానికి చెందిన కృష్ణంరాజు. 2012లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన కృష్ణంరాజు తొలుత సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే, కేవలం రెండు నెలల్లోనే వారి మధ్య మనస్పర్థలు రావడంతో రాజీ కుదుర్చుకుని విడిపోయారు. అనంతరం మహబూబాబాద్ జిల్లాకు చెందిన మరో యువతిని రెండో వివాహం చేసుకుని, ఆమెతో కూడా ఆరు నెలలు మాత్రమే కాపురం చేసి వదిలేశాడు.

ఇక్కడితో ఆగకుండా, ఆరు నెలల క్రితం సూర్యాపేట జిల్లాకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికను మూడో వివాహం చేసుకున్నాడు. ఆమెతో కూడా కొన్నాళ్లకే సంబంధాలు తెంచుకుని, నాలుగవ పెళ్ళికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు బాగోతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది.

వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలన్నీ నిజమని తేలడంతో కృష్ణంరాజును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదయింది.
Krishnam Raju
Constable Krishnam Raju
Suryapet
Minor girl marriage
Multiple marriages

More Telugu News