Jasprit Bumrah: కోహ్లీలాగే బుమ్రా కూడా.. అతని త్యాగం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు: మాజీ కోచ్

Jasprit Bumrahs sacrifice surprised everyone says former coach
  • బుమ్రా సక్సెస్ వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టిన మాజీ కోచ్ భరత్ అరుణ్
  • బుమ్రా యాక్షన్ వల్ల శరీరంపై తీవ్ర ఒత్తిడి పడుతుందని వెల్లడి
  • యాక్షన్ మార్చాలని చూసినా వేగం తగ్గిపోవడంతో విరమణ
  • ఫాస్ట్ బౌలింగ్ తట్టుకోవాలంటే 'బుల్'లా మారాలని సూచన
  • బర్గర్లు, పిజ్జాలు ఒక్కరాత్రిలోనే మానేసిన బుమ్రా
  • ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీకి ఏమాత్రం తీసిపోడని ప్రశంస
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన విలక్షణమైన బౌలింగ్ యాక్షన్‌తో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లను సైతం వణికిస్తాడు. అయితే, అతని అసాధారణ బౌలింగ్ శైలి వెనుక ఓ పెద్ద కథే ఉంది. ఆ యాక్షన్ కారణంగా అతని శరీరంపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, దానిని తట్టుకోవడానికే ఒక ప్రత్యేక ప్రణాళిక రచించామని భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తాజాగా వెల్లడించారు. బుమ్రా విజయ రహస్యం అతని అంకితభావంలోనే దాగి ఉందని ఆయన వివరించారు.

ఓ ఇంటర్వ్యూలో భరత్ అరుణ్ మాట్లాడుతూ.. "బుమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా ప్రత్యేకమైంది. అది అతనికి అపారమైన వేగాన్ని అందిస్తుంది. కానీ, అదే సమయంలో అతని శరీరంపై తీవ్ర ఒత్తిడిని కూడా పెంచుతుంది. నిజం చెప్పాలంటే, తొలుత మేము అతని యాక్షన్‌ను మార్చడానికి ప్రయత్నించాం. కానీ, యాక్షన్ మార్చిన తర్వాత బంతిలో వేగం పూర్తిగా తగ్గిపోయింది. అద్భుతమైన యాక్షన్ ఉండి బంతిలో వేగం లేకపోతే ప్రయోజనం ఏంటి?" అని అన్నారు.

దీంతో తాము బుమ్రా యాక్షన్‌ను మార్చకూడదని నిర్ణయించుకున్నట్లు అరుణ్ తెలిపారు. "మేము ఫిజియో, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌తో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాం. అతని యాక్షన్‌ను మార్చవద్దని, దానికి బదులుగా ఆ ఒత్తిడిని తట్టుకునేలా శరీరాన్ని ఒక 'బుల్' (ఎద్దు)లా బలంగా తయారు చేయాలని సూచించాం. ఫాస్ట్ బౌలింగ్ భారాన్ని మోయాలంటే ఆహార నియమాలు, వ్యాయామం, త్యాగాలు చాలా అవసరమని అతనికి చెప్పాం" అని వివరించారు.

తమ సూచనకు బుమ్రా తక్షణమే స్పందించాడని భరత్ అరుణ్ ప్రశంసించారు. "ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీ గురించి చాలా గొప్పగా చెబుతారు. బుమ్రా కూడా ఏమాత్రం తక్కువ కాదు. మేం చెప్పిన వెంటనే అతను మారిపోయాడు. బర్గర్లు, పిజ్జాలు, మిల్క్‌షేక్‌లు అంటే అతనికి ప్రాణం. కానీ, ఒక్క రాత్రిలోనే వాటన్నింటినీ వదిలేశాడు. గుజరాత్‌లో నివసించే ఓ పంజాబీ కుర్రాడు.. బౌలింగ్‌పై ఉన్న ప్రేమతో ఆహారంపై కోరికలను జయించాడు" అని అరుణ్ కొనియాడారు. 2013లో అండర్-19 క్యాంపునకు వచ్చిన బుమ్రా జట్టుకు ఎంపిక కాలేకపోయినా, పట్టుదలతో ఈ స్థాయికి చేరాడని ఆయన గుర్తుచేసుకున్నారు.
Jasprit Bumrah
Bumrah bowling
Bharat Arun
Indian cricket
Team India
bowling action
fitness
Virat Kohli
fast bowling
cricket

More Telugu News