S Jaishankar: మా దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే మా నిర్ణయాలు.. ట్రంప్ ఆంక్షలపై జైశంకర్ రియాక్షన్

Jaishankar defends Indias oil imports from Russia
  • నచ్చకపోతే భారత ఉత్పత్తులు కొనొద్దని అమెరికాకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
  • రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అభ్యంతరం
  • రైతుల ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడబోదని తేల్చిచెప్పిన మంత్రి
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు సుంకాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా స్పందించారు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై అమెరికా అభ్యంతరాలను తోసిపుచ్చారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. ఈ విషయంలో అమెరికా విమర్శలను మంత్రి కొట్టిపారేశారు. ‘భారత ఉత్పత్తులు నచ్చకుంటే కొనొద్దు’ అంటూ అమెరికాకు తేల్చిచెప్పారు. 

ఎకనామిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఢిల్లీలో జరిగిన ‘వరల్డ్‌ లీడర్స్‌ ఫోరం’ సదస్సులో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రైతాంగాన్ని, చిన్న, మధ్య తరగతి పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ప్రధానమని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదన్నారు. భారత ఉత్పత్తులు కొనాలంటూ అమెరికాపై ఎవరూ ఒత్తిడి చేయడంలేదని, మీకు నచ్చకపోతే భారత చమురును, శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని జైశంకర్ చెప్పారు.

2022లో చమురు ధరల స్థిరీకరణకు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారని జైశంకర్ గుర్తు చేశారు. అప్పుడు ప్రోత్సహించిన ఇదే అమెరికా ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని జైశంకర్ విమర్శించారు.
S Jaishankar
India US relations
India Russia oil
Trump tariffs
Indian foreign policy
World Leaders Forum
Indian economy
Russia oil imports
Jaishankar on US
India national interest

More Telugu News