PM Modi: అంతరిక్ష రంగంలో 'ప్రైవేట్‌'కు ప్రధాని మోదీ భారీ టార్గెట్

PM urges private sector to build 5 Unicorns make 50 rocket launches annually in next 5 years
  • రాబోయే ఐదేళ్లలో 5 యూనికార్న్‌లు సృష్టించాలని పిలుపు
  • ప్రస్తుతం ఐదుగా ఉన్న రాకెట్ ప్రయోగాలను ఏటా 50కి పెంచాలని సూచన
  • గత 11 ఏళ్ల సంస్కరణలతో 350 స్టార్టప్‌లు వచ్చాయన్న ప్రధాని
  • సామాన్యుడి జీవితాన్ని స్పేస్ టెక్నాలజీ సులభతరం చేస్తోందని వెల్లడి
  • త్వరలో గగన్‌యాన్, భారత సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు లక్ష్యం
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాలని, రాబోయే ఐదేళ్లలో కనీసం ఐదు యూనికార్న్‌లను సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏడాదికి ఐదుగా ఉన్న రాకెట్ ప్రయోగాల సంఖ్యను 50కి పెంచే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. శనివారం 'జాతీయ అంతరిక్ష దినోత్సవం' సందర్భంగా ప్రధాని వర్చువల్ విధానంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

గత 11 ఏళ్లలో అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రధాని కొనియాడారు. "భారత అంతరిక్ష ప్రయాణం మన శాస్త్రవేత్తల ప్రతిభ, నూతన ఆవిష్కరణలకు నిదర్శనం" అని ఆయన అన్నారు. ఒకప్పుడు నిబంధనలతో వెనుకబడిన అంతరిక్ష రంగానికి తమ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం కల్పించడం ఒక వరంగా మారిందని, ఇది వరుస విజయాలకు కారణమైందని మోదీ వివరించారు. ప్రభుత్వ సంస్కరణల ఫలితంగానే ఈ రంగంలో 350కి పైగా స్టార్టప్‌లు వచ్చాయని తెలిపారు.

అంతరిక్ష సాంకేతికత ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనలోనూ భాగమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. "పంటల బీమా పథకాల కోసం శాటిలైట్ ఆధారిత అంచనాలు, మత్స్యకారులకు ఉపగ్రహాల ద్వారా సమాచారం, విపత్తుల నిర్వహణ, పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్‌లో జియోస్పేషియల్ డేటా వాడకం వంటివి సామాన్యుడి జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి" అని ఆయన వివరించారు.

భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, శాస్త్రవేత్తల కృషితో త్వరలోనే భారత్ 'గగన్‌యాన్' మిషన్‌ను ప్రయోగిస్తుందని, రాబోయే కాలంలో మన దేశం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) కూడా నిర్మిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో నూతన తరం సంస్కరణలను కొనసాగించేందుకు ప్రభుత్వానికి సంకల్పం ఉందని చెబుతూ, యువతకు అపార అవకాశాలు కల్పించే ఈ రంగం వృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రైవేట్ సంస్థలను ప్ర‌ధాని ఆహ్వానించారు.
PM Modi
Indian space program
space technology
private sector
Gaganyaan mission
space station
national space day
Indian scientists
rocket launches
space startups

More Telugu News