Siddaramaiah: యోగి చేశాడా.. అమిత్ షా చేశాడా.. నేనెందుకు రాజీనామా చేయాలి?: సిద్ధరామయ్య

Siddaramaiah Responds to Resignation Demands After Stampede
  • ప్రతిపక్ష ఎమ్మెల్యేల డిమాండ్ పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్
  • బీజేపీ మంత్రులు రాజీనామా చేయలేదేమని ప్రశ్న
  • చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో రచ్చ
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటన అంశం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. ఈ ఏడాది జూన్ 4న జరిగిన ఈ దురదృష్టకర ఘటనలో పదకొండు మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై సిద్ధరామయ్య స్పందిస్తూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు అక్కడి ముఖ్యమంత్రులు రాజీనామా చేయలేదేమని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట జరిగి 39 మంది చనిపోయారని గుర్తుచేస్తూ.. నైతిక బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. 2008లో హిమాచల్ ప్రదేశ్ లోని నైనా దేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగి 162 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని, అప్పుడు కూడా ఆ రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ కూడా రాజీనామా చేయలేదని గుర్తుచేశారు.

2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్ లోని జోధ్ పూర్ చాముండి దేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగి 250 మంది చనిపోయారని, అప్పుడు సీఎం పదవిలో ఉన్న బీజేపీ నేత వసుంధరా రాజే కూడా రాజీనామా చేయలేదని గుర్తుచేశారు. 2022లో ఐపీఎల్ టైటిల్ గెల్చుకున్న గుజరాత్ టైటాన్ జట్టు కరోనా వ్యాప్తి పీక్ స్టేజీలో ఉన్న సమయంలోనూ విజయోత్సవాలు జరుపుకుందని, అందులో సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబం, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ కూడా పాల్గొన్నారని చెప్పారు.

ఓవైపు మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న సమయంలో విజయోత్సవాల పేరుతో భారీగా జనం గుమిగూడినా ఎవరూ నైతిక బాధ్యత వహించలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంతటి ఘోరం జరిగినా ఎవరూ నైతిక బాధ్యత వహించరు, బీజేపీ సీఎంలు, మంత్రులు రాజీనామా చేయరు కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం రాజీనామా చేయాలని అదే బీజేపీ నేతలు డిమాండ్ చేస్తారంటూ సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు.
Siddaramaiah
Karnataka Assembly
stampede
Yogi Adityanath
Amit Shah
Gujarat Titans
Naina Devi Temple
Rajasthan Temple Stampede
political controversy
Chief Minister resignation

More Telugu News