Uttar Pradesh: పసికందు మృతదేహంతో కలెక్టర్ ఆఫీసుకు తండ్రి!

Baby Dies At Hospital Father Reaches Government Office With Body In Bag
  • యూపీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి అమానుషం
  • డబ్బుల కోసం డెలివరీ ఆలస్యం చేయడంతో నవజాత శిశువు మృతి
  • బిడ్డ మృతదేహంతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన తండ్రి
  • ఫిర్యాదుతో తక్షణమే స్పందించిన అధికారులు
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డార్ ఆసుపత్రి సీజ్
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం డబ్బులకు కక్కుర్తిపడి ప్రసవంలో జాప్యం చేయడంతో తన నవజాత శిశువు మరణించిందని ఆరోపిస్తూ ఓ తండ్రి ఆ పసికందు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జిల్లా యంత్రాంగం తక్షణమే ఆసుపత్రిని సీజ్ చేసింది.

వివరాల్లోకి వెళితే.. విపిన్ గుప్తా అనే వ్యక్తి తన భార్యను ప్రసవం కోసం స్థానిక గోల్డార్ ఆసుపత్రిలో చేర్పించారు. నార్మల్ డెలివరీకి రూ. 10,000, సి-సెక్షన్‌కు రూ. 12,000 అవుతుందని ఆసుపత్రి సిబ్బంది మొదట చెప్పారని బాధితుడు తెలిపారు. "నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతుంటే, వాళ్లు ఫీజు పెంచుకుంటూ పోయారు. రాత్రి 2:30 గంటల సమయానికి కొంత డబ్బు ఏర్పాటు చేశాను. అయినా వారు ఇంకా ఎక్కువ డిమాండ్ చేశారు. డబ్బు మొత్తం చెల్లిస్తేనే ఆపరేషన్ చేస్తామని తేల్చిచెప్పారు" అని విపిన్ గుప్తా ఆరోపించారు.

తాను డబ్బు సర్దుబాటు చేస్తానని, ముందు డెలివరీ చేయమని ఎంత వేడుకున్నా వారు కనికరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జాప్యం కారణంగా తన బిడ్డ చనిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. అంతటితో ఆగకుండా, బిడ్డ చనిపోయిన తర్వాత తన భార్యను ఆసుపత్రి సిబ్బంది రోడ్డుపైకి గెంటేశారని ఆయన ఆరోపించారు. దీంతో న్యాయం కోసం తన బిడ్డ మృతదేహాన్ని తీసుకుని నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు.

ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టారు. "నవజాత శిశువు మృతి కేసులో, గోల్డార్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను జిల్లా మహిళా ఆసుపత్రికి తరలిస్తున్నాం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశాం. బాధిత కుటుంబానికి ప్ర‌భుత్వం అండగా నిలుస్తుంది" అని క‌లెక్ట‌ర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అమానవీయ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Uttar Pradesh
Vipin Gupta
Lakhimpur Kheri
private hospital
infant death
medical negligence
Goldar Hospital
collector office
delivery charges

More Telugu News