John Bolton: భారత్‌పై ట్రంప్ తీరును తప్పుబట్టిన బోల్టన్‌కు షాక్.. ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు

FBI Raids John Bolton Home After Trump Criticism
  • అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు
  • రహస్య పత్రాలకు సంబంధించిన కేసులో భాగంగా మేరీల్యాండ్‌లోని నివాసంలో సోదాలు
  • భారత్ విషయంలో ట్రంప్ విధానాలను ఇటీవలే తీవ్రంగా విమర్శించిన బోల్టన్
  • ట్రంప్ హయాంలో మొదలై, ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చిన పాత కేసు
  • చట్టానికి ఎవరూ అతీతులు కారంటూ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ట్వీట్
  • బోల్టన్ రాసిన పుస్తకంలోని రహస్య సమాచారమే కారణమన్న ఆరోపణలు
అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు సోదాలు నిర్వహించారు. భారత్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. రహస్య పత్రాలకు సంబంధించిన ఒక ఉన్నతస్థాయి జాతీయ భద్రతా విచారణలో భాగంగా మేరీల్యాండ్‌లోని బోల్టన్ నివాసంలో ఈ సోదాలు జరిగాయి.

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ ఆపరేషన్ ప్రారంభమయ్యాక కాశ్ పటేల్ తన ఎక్స్ ఖాతాలో "చట్టానికి ఎవరూ అతీతులు కారు... ఎఫ్‌బీఐ ఏజెంట్లు విధి నిర్వహణలో ఉన్నారు" అంటూ ఒక పోస్ట్ చేశారు. వాస్తవానికి ఈ విచారణ డొనాల్డ్ ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలోనే ప్రారంభం కాగా, జో బైడెన్ పరిపాలనలో దీనిని నిలిపివేశారు. ఇప్పుడు ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడంతో ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారు.

2018 నుంచి 2019 వరకు ట్రంప్ ఎన్‌ఎస్‌ఏగా బోల్టన్ పని చేశారు. 2020లో ఆయన రాసిన "ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్" పుస్తకం విషయంలో గోప్యతా ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఈ పుస్తక ప్రచురణను అడ్డుకోవడానికి ట్రంప్ అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించారు.

ట్రంప్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి బోల్టన్ ఆయన విదేశాంగ విధానాలను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఒక భారతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారత్‌పై ట్రంప్ అనవసరంగా కఠినంగా వ్యవహరిస్తున్నారని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై భారీగా టారిఫ్‌లు విధించడం ద్వైపాక్షిక సంబంధాలలో ఒక పెద్ద తప్పిదమని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం బీజింగ్-మాస్కో కూటమి వైపు భారత్‌ను మరింతగా నెట్టివేసి ఉండొచ్చని గతవారం ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల భద్రతా అనుమతులు రద్దు చేయబడిన అధికారుల జాబితాలో బోల్టన్ పేరు కూడా ఉండటం గమనార్హం.
John Bolton
Donald Trump
FBI raid
India US relations
Kash Patel

More Telugu News