Israel Gaza Conflict: గాజాపై ఇజ్రాయెల్ గురి.. హమాస్ ముందు కీలక ప్రతిపాదనలు

Israels Warning To Hamas Before Gaza City Takeover
  • తమ షరతులు ఒప్పుకోకపోతే గాజాను నాశనం చేస్తామన్న ఇజ్రాయెల్
  • బందీలందరినీ విడిచిపెట్టి, ఆయుధాలు వీడాలని హమాస్‌కు అల్టిమేటం
  • గాజాను రఫా, బీట్ హనూన్‌ నగరాల్లా మారుస్తామని రక్షణ మంత్రి హెచ్చరిక
  • హమాస్‌ను ఓడించడం, బందీల విడుదల కలిసే జరుగుతాయన్న నెతన్యాహు
హమాస్ తమ షరతులకు అంగీకరించకపోతే గాజా నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బందీలందరినీ విడిచిపెట్టి, ఆయుధాలను వదిలేయాలనే తమ డిమాండ్లను ఒప్పుకోని పక్షంలో గాజా నగరాన్ని గతంలో నాశనం చేసిన రఫా, బీట్ హనూన్‌ నగరాల మాదిరిగా మారుస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చ‌రించారు. గాజాలో భారీ సైనిక చర్యకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

"త్వరలోనే గాజాలోని హమాస్ హంతకులు, రేపిస్టుల తలలపై నరక ద్వారాలు తెరుచుకుంటాయి. బందీలందరినీ విడిచిపెట్టి, నిరాయుధులుగా మారే మా షరతులకు వారు అంగీకరించే వరకు ఇది కొనసాగుతుంది" అని రక్షణ మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకవేళ హమాస్ ఒప్పుకోకపోతే, వారి రాజధాని అయిన గాజాను గతంలో జరిగిన ఆపరేషన్లలో నేలమట్టమైన రఫా, బీట్ హనూన్ నగరాల వలే మారుస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు సైన్యానికి అధికారం ఇస్తానని ప్రకటించిన మరుసటి రోజే రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో మిగిలిన బందీలందరినీ విడిపించేందుకు తక్షణమే చర్చలు ప్రారంభించాలని నెతన్యాహు ఆదేశించారు. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడం, హమాస్ స్థావరాలను నాశనం చేయడంతో పాటే బందీల విడుదల ప్రక్రియ కూడా కొనసాగుతుందని ఆయన తెలిపారు.

ఈ వారం ప్రారంభంలో గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే ఆపరేషన్ కోసం సుమారు 60,000 మంది రిజర్విస్టులను సైన్యంలోకి తీసుకునేందుకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. "హమాస్‌ను ఓడించడం, మన బందీలను విడిపించడం అనే రెండు అంశాలు కలిసే జరుగుతాయి" అని నెతన్యాహు ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.

మరోవైపు, మధ్యవర్తులు ప్రతిపాదించిన తాజా కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ ఈ వారం మొదట్లోనే అంగీకారం తెలిపింది. అయితే, దీనిపై ఇజ్రాయెల్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. బందీలను దశలవారీగా విడుదల చేయాలనేది తాజా ప్రతిపాదన కాగా, ఇజ్రాయెల్ మాత్రం అందరినీ ఒకేసారి విడిచిపెట్టాలని పట్టుబడుతున్నట్లు ఏఎఫ్‌పీ నివేదిక పేర్కొంది. గాజాలో యుద్ధాన్ని విస్తరించాలన్న ఇజ్రాయెల్ ప్రణాళికపై అంతర్జాతీయంగా, దేశీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో ఎక్కువ మంది సాధారణ పౌరులతో సహా 1,219 మంది మరణించారు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 62,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించిన‌ట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Israel Gaza Conflict
Benjamin Netanyahu
Gaza city
Hamas
Israel Katz
Hostage release
Rafah
Beit Hanoun
Ceasefire agreement
Palestinians

More Telugu News