PM Modi: అవినీతిపై సరికొత్త అస్త్రం.. జైలు నుంచి ఫైళ్లపై సంతకాలు చేసే రోజులు పోయాయి: ప్రధాని మోదీ

Prime Minister Modi backs bills on ousting arrested PM CM
  • అవినీతిపై కొత్తగా తెచ్చిన మూడు బిల్లులను సమర్థించిన ప్రధాని మోదీ
  • తీవ్ర ఆరోపణలతో అరెస్టయితే 30 రోజుల్లో బెయిల్ తప్పనిసరి అని వెల్లడి
  • బెయిల్ రాకపోతే 31వ రోజు పీఎం, సీఎం పదవికి రాజీనామా చేయాలి
  • జైలు నుంచి ఫైళ్లపై సంతకాలు చేసే రోజులు పోయాయంటూ పరోక్ష విమర్శలు
  • కొత్త చట్టాలంటే ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని ఎద్దేవా
  • కాంగ్రెస్, ఆర్జేడీల అవినీతిపై బీహార్ సభలో తీవ్ర స్థాయిలో ధ్వజం
అవినీతిపై తమ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల్లోగా బెయిల్ పొందలేకపోతే, 31వ రోజున తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన మూడు కొత్త బిల్లులను ఆయన గట్టిగా సమర్థించారు. శుక్రవారం బీహార్‌లోని గయలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ కొత్త చట్టాలను చూసి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో ప్రజలందరికీ తెలుసని మోదీ చుర‌క‌లంటించారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవినీతి నిరోధక బిల్లుల పరిధిలోకి దేశ ప్రధాని కూడా వస్తారని ఆయన గుర్తుచేశారు. "ఈ చట్టం అమల్లోకి వస్తే, ఏ ముఖ్యమంత్రి, మంత్రి లేదా ప్రధానమంత్రి అయినా అరెస్ట్ అయిన 30 రోజుల్లోగా బెయిల్ తెచ్చుకోవాలి. లేదంటే వారు తమ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది" అని ప్రధాని వివరించారు.

ప్రస్తుత చట్టాల ప్రకారం, ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల పాటు అదుపులో ఉంటే సస్పెండ్ అవుతాడని, కానీ ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం జైల్లో ఉంటూ కూడా అధికార ప్రయోజనాలను అనుభవిస్తున్నారని మోదీ అన్నారు. ఇటీవల కాలంలో జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం చూశామని, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నాయకుల తీరు ఇలా ఉంటే అవినీతిపై పోరాటం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.

స్వాతంత్ర్యం తర్వాత 60-65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అవినీతి కేసులు లెక్కలేనన్ని ఉన్నాయని, కానీ తమ ప్రభుత్వానికి ఒక్క అవినీతి మరక కూడా అంటలేదని మోదీ అన్నారు. బీహార్‌లోని ఆర్జేడీ అవినీతి గురించి ప్రతి చిన్న పిల్లాడికి కూడా తెలుసని ఎద్దేవా చేశారు. అవినీతిపై పోరాటాన్ని చివరి వరకు తీసుకెళ్లాలంటే ఎవరినీ వదిలిపెట్టకూడదనేది తన గట్టి నమ్మకమని చెప్పారు. 

కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వాలు ప్రజాధనం విలువను ఎన్నడూ గుర్తించలేదని, తమ ఖజానాలు నింపుకోవడానికే దాన్ని ఉపయోగించాయని ఆరోపించారు. అందుకే వారి హయాంలో ప్రాజెక్టులు ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉండేవని, ప్రాజెక్టు ఆలస్యమయ్యే కొద్దీ దాని నుంచి డబ్బులు దండుకునేవారని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు.
PM Modi
Corruption law
Anti corruption bill
Bihar
Arvind Kejriwal
RJD
Congress
Gaya
Prime Minister Modi

More Telugu News