Nikki Haley: భారత్‌ను శత్రువులా చూడొద్దు.. ట్రంప్ సర్కార్‌ను హెచ్చరించిన నిక్కీ హేలీ

Nikki Haley Warns Trump Administration on India Relations
  • అమెరికా-భారత్ బంధం తెగిపోయే దశలో ఉందని హెచ్చరిక
  • భారత్ శత్రువు కాదని, చైనాలా దానిని చూడొద్దని నిక్కీ హేలీ హితవు 
  • చైనాను ఎదుర్కోవాలంటే భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • భారత్‌తో బంధాన్ని చెడగొట్టుకోవడం చారిత్రక తప్పిదమవుతుందని వార్నింగ్
భారత్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరిపై రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటాన్ని కారణంగా చూపుతూ ట్రంప్ ప్రభుత్వం విధించిన భారీ సుంకాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే దశకు చేరుకున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చైనాను ప్రపంచవ్యాప్తంగా కట్టడి చేయాలంటే అమెరికాకు భారత్‌తో సత్సంబంధాలు అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు.

ప్రముఖ మీడియా సంస్థ 'న్యూస్‌వీక్'లో రాసిన ఒక వ్యాసంలో నిక్కీ హేలీ ఈ అభిప్రాయాలను వెల్లడించారు. "అమెరికా-భారత్ బంధం ప్రస్తుతం ప్రమాదకరమైన దశలో ఉంది. సుంకాల వంటి సమస్యల కారణంగా ప్రపంచంలోని ఈ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య దూరం పెరగడానికి వీల్లేదు. భారత్‌ను చైనాలా శత్రువుగా చూడటం తప్పు. అది మనకు అత్యంత విలువైన స్నేహపూర్వక, ప్రజాస్వామ్య భాగస్వామి" అని ఆమె పేర్కొన్నారు.

ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోగల ఏకైక దేశం భారత్ మాత్రమేనని, అలాంటి దేశంతో 25 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని దెబ్బతీసుకోవడం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని ఆమె హెచ్చరించారు. "ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధాన లక్ష్యాలు నెరవేరాలంటే భారత్‌తో సంబంధాలను తిరిగి గాడిన పెట్టడం చాలా ముఖ్యం. చైనా నుంచి కీలక సరఫరా గొలుసులను తరలించడంలో, రక్షణ రంగంలో, మధ్యప్రాచ్యంలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్ పాత్ర ఎంతో కీలకం" అని నిక్కీ హేలీ తన వ్యాసంలో వివరించారు.

జనాభా, ఆర్థిక శక్తి పరంగా భారత్ వేగంగా ఎదుగుతోందని ఆమె విశ్లేషించారు. "కమ్యూనిస్టు చైనా ఎదుగుదల ప్రపంచానికి ముప్పుగా మారితే, ప్రజాస్వామ్య దేశమైన భారత్ శక్తిమంతంగా మారడం స్వేచ్ఛా ప్రపంచానికి మంచిదే. ఈ నిజాన్ని ట్రంప్ ప్రభుత్వం గ్రహించాలి" అని ఆమె సూచించారు. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ పనిచేసిన విషయం తెలిసిందే.
Nikki Haley
India US relations
Donald Trump
US India trade
India Russia oil
China
US foreign policy
India foreign policy
Newsweek
Tariffs

More Telugu News