White House: టిక్ టాక్ అకౌంట్ ను ప్రారంభించిన వైట్ హౌస్.. ట్రంప్ వింత వైఖరి

White House Launches TikTok Account Amidst Ban Controversy
  • నిషేధం కత్తి వేలాడుతున్న తరుణంలో... టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైట్ హౌస్
  • బ్యాన్ చేస్తామన్న యాప్‌లోనే ఖాతా ప్రారంభం
  • గతంలో నిషేధానికి మద్దతిచ్చి, ఇప్పుడు వెనక్కి తగ్గిన ట్రంప్
ఒకవైపు టిక్ టాక్ పై నిషేధం కత్తి వేలాడుతుండగానే, మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అనూహ్యంగా చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టింది. జాతీయ భద్రతకు ముప్పు ఉందంటూ ఏ యాప్‌నైతే నిషేధించాలని అమెరికా సర్కార్ భావించిందో, ఇప్పుడు అదే వేదికగా తమ ప్రచారాన్ని ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంగళవారం వైట్ హౌస్ అధికారికంగా టిక్‌టాక్‌ ఖాతాను ప్రారంభించి, తొలి పోస్టును కూడా విడుదల చేసింది.

"మేము తిరిగి వచ్చాం! వాట్స్ అప్ టిక్‌టాక్?" అనే క్యాప్షన్‌తో 27 సెకన్ల నిడివి ఉన్న వీడియోను వైట్ హౌస్ పోస్ట్ చేసింది. ఈ ఖాతా తెరిచిన గంటలోనే సుమారు 4,500 మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. ఈ పరిణామం ట్రంప్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. చైనాకు చెందిన బైట్‌డాన్స్ సంస్థ యాజమాన్యంలో నడుస్తున్న టిక్‌టాక్‌ను అమెరికాలో విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని గతంలోనే ట్రంప్ చట్టం తీసుకొచ్చారు.

ఈ చట్టం ప్రకారం, జనవరి 19 నాటికే నిషేధం అమలు కావాల్సి ఉన్నా, అధ్యక్షుడు ట్రంప్ దానిని నిలిపివేశారు. ఆ తర్వాత జూన్ మధ్యలో మరో 90 రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువు సెప్టెంబర్ మధ్య నాటికి ముగియనుంది. ఈలోగా చైనాకు చెందని సంస్థకు టిక్‌టాక్‌ను విక్రయించకపోతే అమెరికాలో దానిపై నిషేధం అమలు కావడం ఖాయం.

అయితే, యువ ఓటర్లను ఆకట్టుకోవడంలో టిక్‌టాక్ కీలక పాత్ర పోషిస్తోందని భావించిన ట్రంప్, తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో నిషేధానికి గట్టిగా మద్దతు పలికిన ఆయనే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగతంగా డొనాల్డ్ ట్రంప్‌కు టిక్‌టాక్‌లో 110.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, 2024 నవంబర్ 5న జరిగిన ఎన్నికల రోజు తర్వాత ఆయన ఆ ఖాతాలో ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఇక ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైట్ హౌస్‌కు ఎక్స్ లో 2.4 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 9.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 
White House
TikTok
Donald Trump
US Ban
Social Media
China
ByteDance
US Elections
Youth Voters

More Telugu News