Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు, వైఎస్ పాత్ర ఉంది!: రేవంత్ రెడ్డి

Revanth Reddy Praises Chandrababu YS Contribution to Hyderabad Development
  • 1994 నుండి 2014 వరకు నాటి ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారని వ్యాఖ్య
  • హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేశారని వ్యాఖ్య
  • ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని విమర్శ
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల పాత్ర ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1994 నుండి 2014 వరకు హైదరాబాద్ నగరాన్ని ఆనాటి ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైటెక్ సిటీని నిర్మిస్తున్న సమయంలో చాలామంది అవహేళన చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యో నగరాలతో పోటీ పడుతోందని తెలిపారు. మన వద్ద అన్ని ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయడం చాలా అవసరమని అన్నారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లో తెలుగువారు ఉన్నారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ చొరవతోనే ఐటీ రంగంలో చాలామంది రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు.

అమెరికాలో మన ఐటీ నిపుణులు పనిచేయడం ఆపేస్తే ఆ దేశం స్తంభించిపోతుందని అన్నారు. మన ప్రాంతం విద్యార్థులు ఇక్కడే చదువుకోవాలని నాటి ముఖ్యమంత్రులు పలు విద్యాసంస్థలను నిర్మించారని తెలిపారు. ఇప్పుడు మనం హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడుతుంటే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారిని ప్రజలే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మూసీ నది ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదని ఆయన అన్నారు.

తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మూసీ నది ప్రక్షాళనతో పాత నగరానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. అన్ని సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తామని చెప్పారు. నగర అభివృద్ధికి అడ్డుపడేవారు ఎవరైనా మనకు శత్రువులేనని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో కూడిన ఉద్యోగ భద్రతను ఇచ్చామని తెలిపారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన జరగాలని ఆయన ఆకాంక్షించారు.
Revanth Reddy
Hyderabad development
Chandrababu Naidu
YS Rajasekhara Reddy
Telangana

More Telugu News