Rahul Gandhi: ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన రాహుల్‌గాంధీ కారు.. వీడియో ఇదిగో!

Rahul Gandhi Car Hits Constable During Voter Adhikar Yatra
  • బీహార్‌లోని నవాడాలో పోలీస్ కానిస్టేబుల్ పాదాలపైకి ఎక్కిన కారు
  • వెంటనే స్పందించి వాటర్ బాటిల్ అందించి పరామర్శించిన రాహుల్
  • ఇది 'క్రష్ జనతా యాత్ర' అంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు
  • రాహుల్ కనీసం కిందకు దిగి చూడలేదని ఆరోపించిన బీజేపీ నేతలు
  • బీహార్ ఎన్నికల ముందు కాంగ్రెస్ చేపట్టిన కీలక యాత్ర ఇది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌లో నిర్వహిస్తున్న 'ఓటర్ అధికార్ యాత్ర'లో ఈ ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది. నవాడా జిల్లాలో జనసందోహం మధ్య సాగుతున్న యాత్రలో ఆయన ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ జీపు ప్రమాదవశాత్తు ఓ పోలీస్ కానిస్టేబుల్ పాదాలపైకి ఎక్కింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

కిక్కిరిసిన జనం, భద్రతా సిబ్బంది నడుమ వాహనం నెమ్మదిగా ముందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనం కింద కానిస్టేబుల్ చిక్కుకోవడంతో అప్రమత్తమైన ఇతర పోలీసులు, స్థానికులు వెంటనే జీపును వెనక్కి నెట్టి అతడిని బయటకు తీశారు. గాయపడిన కానిస్టేబుల్ కుంటుకుంటూ పక్కకు వెళ్లడం కనిపించింది. వాహనంలో ఉన్న రాహుల్ గాంధీ వెంటనే స్పందించి, గాయపడిన కానిస్టేబుల్‌కు సహాయం చేయాల్సిందిగా తన వలంటీర్లను ఆదేశించారు. అంతేకాకుండా, ఆయన స్వయంగా ఒక వాటర్ బాటిల్ అందించి, ఆ తర్వాత కానిస్టేబుల్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ కారు కానిస్టేబుల్‌ను 'నలిపివేసిందని' (క్రష్), ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. కాంగ్రెస్ యాత్రను 'క్రష్ జనతా యాత్ర'గా అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. "వారసుడు కనీసం వాహనం దిగి ఆ కానిస్టేబుల్‌ను చూడలేదు" అని పూనావాలా విమర్శించారు.

బీహార్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ 'ఓటర్ అధికార్ యాత్ర'ను చేపట్టింది. గత ఆదివారం ససారంలో ప్రారంభమైన ఈ 16 రోజుల యాత్ర, 20కి పైగా జిల్లాల్లో 1300 కిలోమీటర్ల మేర సాగి సెప్టెంబర్ 1న పట్నాలో ముగుస్తుంది. ఈ యాత్రలో ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి ప్రతిపక్ష నాయకులు కూడా పాల్గొన్నారు. "ప్రజాస్వామ్యాన్ని కాపాడే నైతిక పోరాటం"గా కాంగ్రెస్ ఈ యాత్రను అభివర్ణిస్తోంది.
Rahul Gandhi
Bihar
Voter Adhikar Yatra
Police Constable
Road Accident
Nawada
Congress
BJP
Shehzad Poonawalla
Bihar Elections 2024

More Telugu News