Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దుండగుడి దాడి

Delhi CM Rekha Gupta Attacked by Assailant
  • ప్రజల సమస్యలు వినేందుకు సీఎం ‘జన్ సున్ వాయి’ కార్యక్రమం
  • సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన 30 ఏళ్ల యువకుడు
  • ఖండించిన బీజేపీ నేతలు
  • ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదన్న మాజీ సీఎం అతిశీ
ఢిల్లీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత రేఖా గుప్తాపై ఈ రోజు ఉదయం దాడి జరిగింది. ప్రజల సమస్యలు విని పరిష్కరించేందుకు సీఎం రేఖా గుప్త వారంవారం ‘జన్ సున్ వాయి’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేఖా గుప్త ప్రజలను కలుస్తారు. ఈ రోజు ఉదయం ఈ కార్యక్రమంలో భాగంగా రేఖా గుప్త ప్రజల సమస్యలు తెలుసుకుంటుండగా 30 ఏళ్ల యువకుడు ఒకరు ఈ దాడికి పాల్పడ్డాడు. ఇతనిని గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన రాజేశ్ సకారియాగా గుర్తించారు. 

తన సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నించిన దుండగుడు కొన్ని పేపర్లను ముఖ్యమంత్రికి అందించాడు. అనంతరం ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొట్టాడని అధికారవర్గాల సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం భద్రతాసిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సీఎంను వైద్యులు పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ముఖ్యమంత్రిపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌, మంత్రి మజిందర్ సింగ్ సిస్రా, ఇతర నేతలు ఈ దాడి వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కాగా, ముఖ్యమంత్రిపై దుండగుడి దాడి ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ స్పందించారు. సీఎంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదని ఆమె పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు. భద్రతా వైఫల్యంపైనా దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.
Rekha Gupta
Delhi CM
BJP leader
Attack on Rekha Gupta
Jan Sunwai program
Delhi news
Virendra Sachdeva
Atishi
Delhi politics
Law and order

More Telugu News