Prabhas: ప్రభాస్-హను రాఘవపూడి సినిమా సెట్స్ నుంచి ఫొటో లీక్.. మైత్రీ మూవీ మేకర్స్ సీరియస్ వార్నింగ్

Sharing leaked pic from set will be treated as a cyber crime warn makers of Prabhass upcoming film
  • లీకులపై తీవ్రంగా స్పందించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్
  • ఫొటో షేర్ చేస్తే సైబర్ క్రైమ్ కేసు పెడతామని హెచ్చరిక
  • సోషల్ మీడియా ఖాతాలను రిపోర్ట్ చేసి, మూసివేయిస్తామని స్పష్టీకరణ
  • లీకుల వల్ల చిత్ర బృందం నైతిక స్థైర్యం దెబ్బతింటోందని ఆవేదన
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం లీకుల బారిన పడింది. సినిమా సెట్స్ నుంచి ఓ ఫొటో బయటకు రావడంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించింది. లీకైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దానిని సైబర్ క్రైమ్ నేరంగా పరిగణించి కేసులు నమోదు చేస్తామని గట్టిగా హెచ్చరించింది.

ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ తమ అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘#PrabhasHanu సెట్స్ నుంచి తీసిన ఓ చిత్రాన్ని చాలా మంది షేర్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతిని అందించాలని మేము ప్రయత్నిస్తుంటే, ఇలాంటి లీకులు మా బృందం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఇకపై ఎవరైనా ఈ ఫొటోను షేర్ చేస్తే, వారి సోషల్ మీడియా ఖాతాలను రిపోర్ట్ చేసి మూసివేయించడమే కాకుండా, దీనిని సైబర్ నేరంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేసింది.

1940ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ‘ప్రభాస్‌హను’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటి ఇమాన్వి కనిపించనుండగా, బాలీవుడ్ సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి తన ఆస్థాన సంగీత దర్శకుడైన విశాల్ చంద్రశేఖర్‌కే ఈ చిత్రానికి కూడా బాధ్యతలు అప్పగించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతారామం’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కృష్ణకాంత్ సాహిత్యం సమకూరుస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంపై లీకుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Prabhas
Prabhas Hanu
Hanu Raghavapudi
Maitri Movie Makers
Photo Leak
Cyber Crime
Vishal Chandrasekhar
Imanvi
Mythun Chakraborty

More Telugu News