Mallu Bhatti Vikramarka: కేబుల్ ఆపరేటర్లపై కఠినంగా వ్యవహరించండి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఆదేశాలు

Mallu Bhatti Orders Strict Action Against Cable Operators
  • స్తంభాలపై కేబుల్ వైర్ల తొలగింపునకు యుద్ధప్రాతిపదికన చర్యలు
  • ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని భట్టి ఆగ్రహం
  • కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యంపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. పదేపదే నోటీసులు ఇచ్చినా కేబుల్ ఆపరేటర్లు స్పందించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదని, తక్షణమే రంగంలోకి దిగి ఆ వైర్లన్నింటినీ తొలగించాలని స్పష్టం చేశారు.

నిన్న సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కేబుల్ వైర్లను తొలగించుకోవాలని ఆపరేటర్లకు ఏడాదిగా సమయం ఇస్తున్నాం. ఎన్నోసార్లు నోటీసులు పంపాం. అయినా వారిలో చలనం లేదు. ఈ వైర్ల వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. దీన్ని చూస్తూ ఊరుకోలేం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలి" అని ఆదేశించారు.

అదే సమయంలో, అక్రమ విద్యుత్ కనెక్షన్లపైనా కఠినంగా వ్యవహరించాలని భట్టి అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తుల నుంచి కనెక్షన్లు తీసుకోవడం వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, ప్రజలు తప్పనిసరిగా విద్యుత్ శాఖ సిబ్బంది ద్వారానే కనెక్షన్లు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు పనులను మరింత వేగవంతం చేయాలని కూడా ఆయన ఆదేశించారు.

మౌలిక సదుపాయాలపై కీలక సమావేశం:

అంతకుముందు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో మౌలిక సదుపాయాల కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తూనే, ఆర్థిక వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని భట్టి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూనే, మరోవైపు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. 
Mallu Bhatti Vikramarka
Deputy CM Telangana
Cable operators
Electric wires
Telangana electricity
Illegal connections
Infrastructure development
Telangana investments
Uttam Kumar Reddy
Sridhar Babu

More Telugu News