Sarath IAS: సీఎంకు పాదాభివందనం చేసిన రిటైర్డ్ ఐఏఎస్ శరత్‌కు మళ్లీ పదవి!

Sarath IAS Reappointed After Controversy by Congress Government
  • రెడ్కో చైర్మన్‌గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ శరత్
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు
  • గతంలో సీఎం రేవంత్ కు పాదాభివందనం చేసిన శరత్
విశ్రాంత ఐఏఎస్ అధికారి శరత్‌కు రేవంత్ సర్కార్ కీలక పదవిని కట్టబెట్టింది. తెలంగాణ రెడ్కో చైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నాగర్ కర్నూలు బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐఏఎస్ శరత్ పాదాభివందనం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నాడు ఐఏఎస్ అధికారి శరత్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తీవ్రంగా స్పందించారు.

ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులతో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రభుత్వ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదని, ఇకమీదట రాజకీయ సమావేశాలలో ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఇప్పుడు అదే సీఎస్ రామకృష్ణారావు ఐఏఎస్ శరత్‌ను తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (రెడ్కో) చైర్మన్‌గా రెండేళ్ల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ప్రస్తుతం శరత్ నియామకం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు సోషల్ మీడియా వేదికగా దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 
Sarath IAS
Revanth Reddy
Telangana Redco
IAS officer controversy
Telangana government
Renewable Energy Development Corporation
Ramakrishna Rao CS
Political appointments Telangana
IAS code of conduct
Nagar Kurnool

More Telugu News