KCR: కాళేశ్వరం కమిషన్ నివేదిక... హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్లు

KCR Harish Rao File Petitions in High Court Against Kaleshwaram Commission Report
  • జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్లు
  • పీసీ ఘోష్ కమిషన్‌కు విచారణార్హత లేదన్న కేసీఆర్
  • కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణ
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు విచారణార్హత లేదని, ఆ కమిషన్ సమర్పించిన నివేదికను కొట్టివేయాలని వారు కోరారు.

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్, హరీశ్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఆ విధంగా ఉందని వారు పేర్కొన్నారు.

కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విచారణకు సంబంధించిన వివరాలను కమిషన్ విశ్లేషణాత్మకంగా నివేదికలో పొందుపరిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామని, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
KCR
Kaleshwaram Project
Harish Rao
PC Ghosh Commission
Telangana High Court
Revanth Reddy

More Telugu News