Shubman Gill: ఆసియా కప్ కు టీమిండియా ఎంపిక.. వైస్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్

Shubman Gill Named Vice Captain for Asia Cup 2025
  • ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ప్రకటన
  • కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్
  • జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లకు చోటు
  • వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేష్ శర్మ ఎంపిక
  • బుమ్రా నేతృత్వంలో బౌలింగ్ దళం
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. విధ్వంసకర బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్‌ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. గత కొంతకాలంగా భారత టీ20 జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ పై సెలెక్టర్లు నమ్మకముంచారు. టెస్టు సారథి శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనలో కెప్టెన్ గా గిల్ పాత్ర ఎనలేనిది. దాంతో అతడికి ఆసియా కప్ లో ఆడే టీమిండియాలో స్థానం కల్పిస్తారా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. గిల్  ను ఎంపిక చేయడం ద్వారా సెలక్టర్లు ప్రతిభకు పట్టంకట్టినట్టయింది. ఈసారి జట్టు ఎంపికలో యువ ప్రతిభకు, అనుభవానికి మధ్య మంచి సమతుల్యం పాటించారు.

15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఆల్ రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్‌లు స్థానం దక్కించుకున్నారు. వికెట్ కీపింగ్ బాధ్యతల కోసం ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాడు సంజూ శాంసన్‌తో పాటు, జితేష్ శర్మను కూడా జట్టులోకి తీసుకున్నారు.

భారత బౌలింగ్ విభాగానికి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. అతనికి మద్దతుగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించనున్నారు. అనుభవజ్ఞులు, యువకుల కలయికతో పటిష్టంగా కనిపిస్తున్న ఈ జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆసియా కప్ 2025 కోసం ఎంపికైన భారత జట్టు
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
Shubman Gill
Asia Cup 2025
Team India
Suryakumar Yadav
Indian Cricket Team
Cricket
Abhishek Sharma
Tilak Varma
Hardik Pandya
Jasprit Bumrah

More Telugu News