Donald Trump: ట్రంప్ పాలనలో 6 వేల మంది విద్యార్థుల వీసాలు రద్దు

6000 student visas canceled during Trump administration over violations
  • స్థానిక చట్టాలను అతిక్రమించడమే ప్రధాన కారణం
  • ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై వేటు
  • ఉన్నత విద్యావ్యవస్థను పునర్‌ వ్యవస్థీకరించడమే లక్ష్యంగా నిర్ణయాలు
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు స్థానిక చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టాన్ని అతిక్రమిస్తే వీసా రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విధంగా ఇప్పటి వరకు 6 వేల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ వర్గాలను ఉటంకిస్తూ బీబీసీ ఓ రిపోర్టును ప్రచురించింది. ఇందులో 4 వేల మంది చట్టాల అతిక్రమణ, డ్రంకెన్ డ్రైవ్, దాడులు, దోపిడీ వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు పేర్కొంది. ఐఎన్‌ఏ 3బీ కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు 300 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారని తెలిపింది. 

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఉన్నత విద్యావ్యవస్థను పునర్‌ వ్యవస్థీకరించే పనిలో పడ్డారు. ప్రధాన విశ్వవిద్యాలయాలను దృష్టిలో పెట్టుకుని పాలసీల మార్పులు చేపట్టారు. కీలక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు కేటాయించిన నిధుల్లో కోత విధించారు. ఈ చర్యల ప్రభావం విదేశీ విద్యార్థులపై ప్రతికూలంగా ఉంటోంది. యూనివర్సిటీ క్యాంపస్ లలో ఆందోళనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులను అధికారులు అరెస్టు చేశారు.

విద్యార్థులకు వీసాలు మంజూరు చేయడానికి ముందే వారి వారి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. సోషల్ మీడియా ఖాతాల వివరాలు వెల్లడించని విద్యార్థులకు వీసా ప్రక్రియను అధికారులు నిలిపివేస్తున్నారు. కాగా, గతేడాది గణాంకాల ప్రకారం దాదాపు 10 లక్షల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. ఈ విద్యార్థుల ద్వారా అమెరికాకు సుమారు 43.8 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరింది.
Donald Trump
US student visas
foreign students
visa cancellations
US education system
international students
US universities
student protests
Palestine protests
social media accounts

More Telugu News