Babar Azam: పీసీబీ సెంట్రల్ కాంట్రాక్టుల్లో బాబర్, రిజ్వాన్‌లకు బి గ్రేడ్

Babar Rizwan downgraded as Pakistan reveal 2025 26 central contracts
  • పాకిస్థాన్ క్రికెటర్లకు 2025–26 సీజన్ సెంట్రల్ కాంట్రాక్టులు విడుదల
  • స్టార్ ఆటగాళ్లు బాబర్ అజామ్‌, మహమ్మద్ రిజ్వాన్‌లకు ఎదురుదెబ్బ
  • కేటగిరీ 'ఏ' నుంచి కేటగిరీ 'బీ'కి డిమోట్ చేసిన పీసీబీ
  • ఈసారి కేటగిరీ 'ఏ'లో ఏ ఒక్క ఆటగాడికీ చోటు కల్పించని వైనం
  • మొత్తం 30 మంది ఆటగాళ్లకు మూడు కేటగిరీల్లో కాంట్రాక్టులు
రాబోయే 2025–26 అంతర్జాతీయ సీజన్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక ప్రకటన చేసింది. మొత్తం 30 మంది పురుష క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. అయితే, ఈ జాబితాలో స్టార్ ఆటగాళ్లు, సీనియర్ బ్యాటర్లు బాబర్ అజామ్‌, మహమ్మద్ రిజ్వాన్‌లకు బి గ్రేడ్ కాంట్రాక్టులు ఇచ్చారు. గతేడాది టాప్ కేటగిరీ అయిన 'ఏ'లో ఉన్న ఈ ఇద్దరినీ ఈసారి కేటగిరీ 'బీ'కి డిమోట్ చేస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. ఈసారి కేటగిరీ-ఏ లో ఒక్క ఆటగాడికి కూడా స్థానం కల్పించకపోవడం గమనార్హం.

ఇదే సమయంలో ఆసియా కప్ కోసం ప్రకటించిన టీ20 జట్టులోనూ బాబర్, రిజ్వాన్‌లకు చోటు దక్కని విష‌యం తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరూ ఆడినప్పటికీ, గతేడాది నుంచి వారు పాకిస్థాన్ టీ20 జట్టుకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పీసీబీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత సీజన్‌లో 27 మందికి కాంట్రాక్టులు ఇవ్వగా, ఈసారి ఆ సంఖ్యను 30కి పెంచారు. ఈ జాబితాలో 12 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. గతేడాది ప్రదర్శన ఆధారంగా అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాదాబ్ ఖాన్‌లు కేటగిరీ 'సీ' నుంచి 'బీ'కి ప్రమోషన్ పొందారు. షాహీన్ షా అఫ్రిది తన కేటగిరీ 'బీ' స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

కొత్తగా కాంట్రాక్టులు పొందిన వారిలో హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్, మహమ్మద్ హారిస్, మహమ్మద్ నవాజ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు, గతేడాది జాబితాలో ఉన్న ఆమిర్ జమాల్, హసీబుల్లా, ఉస్మాన్ ఖాన్‌లతో సహా ఎనిమిది మంది ఆటగాళ్లు ఈసారి కాంట్రాక్టులను కోల్పోయారు.

పీసీబీ సెంట్రల్ కాంట్రాక్టు ద‌క్కించుకున్న ఆట‌గాళ్ల‌ జాబితా ఇదే..
కేటగిరీ-బీ: బాబర్ అజామ్‌, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా.

కేటగిరీ-సీ: అబ్దుల్లా షఫీక్, నసీమ్ షా, నొమాన్ అలీ, సాజిద్ ఖాన్, సౌద్ షకీల్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహమ్మద్ హారిస్, మహమ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్.

కేటగిరీ-డీ: షాన్ మసూద్, అహ్మద్ దానియాల్, హుస్సేన్ తలత్, ఖుర్రం షహజాద్, ఖుష్దిల్ షా, మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహమ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, సుఫియాన్ మొఖిమ్.


Babar Azam
Pakistan Cricket Board
PCB
Mohammad Rizwan
Pakistan Cricket
Central Contracts
Pak players
T20 team
Shaheen Shah Afridi
Haris Rauf

More Telugu News