Cyclone: నేటి మధ్యాహ్నం తీరం దాటనున్న వాయుగుండం .. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

Cyclone to Cross Coast Today Heavy Rain Alert for Uttarandhra
  • ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం
  • ఒడిశా-ఉత్తర కోస్తా మధ్య ఈ మధ్యాహ్నం తీరం దాటే అవకాశముందన్న వాతావరణ శాఖ
  • పాఠశాలలు, అంగన్ వాడీలకు సెలవు ప్రకటించిన శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నం ఒడిశా-ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా కదిలి తీరం దాటనుంది.

తీరం వెంబడి బలమైన ఈదురుగాలుల హెచ్చరిక

వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు, మిగిలిన కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

శ్రీకాకుళంలో అప్రమత్తత చర్యలు

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. నాగావళి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తుపాను పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో 08942–240557 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఏవైనా అత్యవసరాలు ఎదురైతే వెంటనే ఈ నంబర్‌ను సంప్రదించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. 
Cyclone
Bay of Bengal
Andhra Pradesh Rains
Odisha
Srikakulam
Ram Mohan Naidu
Atchannaidu
Heavy Rainfall Alert
Weather Forecast
IMD

More Telugu News