Gurgaon Incident: ఉత్తరాదిలో ఇంత వివక్ష ఉందా?.. కేరళ వాసి షాకింగ్ పోస్ట్ వైరల్

Gurgaon Incident Rapido Driver Faces Discrimination Kerala Man Shares Shocking Post
  • గుర్‌గావ్‌లో రాపిడో డ్రైవర్‌పై మతపరమైన వేధింపులు
  • ముస్లిం కావడంతో డ్రైవర్‌ను అడ్డుకుని ప్రశ్నించిన స్థానికుడు
  • డ్రైవర్‌కు మద్దతుగా నిలిచి సదరు వ్యక్తిని నిలదీసిన కేరళ ప్రయాణికుడు
  • సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకోవడంతో వైరల్
  • ఉత్తరాదిలో వివక్షపై నెటిజన్ల తీవ్ర స్పందన, చర్చ
దేశ రాజధాని శివారు ప్రాంతమైన గుర్‌గావ్‌లో మతం పేరుతో ఓ రాపిడో ఆటో డ్రైవర్‌కు ఎదురైన అవమానకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి తన కోసం వచ్చిన డ్రైవర్‌ను ఓ స్థానిక వ్యక్తి వేధించడం, దానికి తాను అడ్డుకున్న తీరును వివరిస్తూ కేరళకు చెందిన ఓ ప్రయాణికుడు పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కేరళకు చెందిన ఓ వ్యక్తి గుర్‌గావ్‌లోని సెక్టార్ 40లో ఉన్న తన నివాసానికి వెళ్లేందుకు అర్ధరాత్రి రాపిడో ఆటో బుక్ చేసుకున్నారు. డ్రైవర్ అక్కడికి చేరుకోగానే, స్థానిక వ్యక్తి అతడిని అడ్డుకున్నాడు. ముస్లింలా కనిపించిన ఆ డ్రైవర్‌ను అనుమానంగా చూస్తూ "ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా అతని ఫోన్ చూపించమని డిమాండ్ చేశాడు.

డ్రైవర్ తాను రైడ్ కోసమే వచ్చానని ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినకపోవడంతో ప్రయాణికుడు జోక్యం చేసుకున్నాడు. "ఇది నా రైడ్, నేను ఇక్కడే నివసిస్తున్నాను. ఎవరు రావాలో, రాకూడదో చెప్పడానికి మీరెవరు? ముస్లింలు ఇక్కడికి రాకూడదని ఏమైనా రూల్ ఉందా?" అని ఆ వ్యక్తిని గట్టిగా నిలదీశాడు. "రాపిడో రైడ్స్ అన్నీ ట్రాక్ చేయబడతాయి. డ్రైవర్‌ కన్నా మీలాంటి వాళ్ల వల్లే మాకు భయంగా ఉంది" అని స్పష్టం చేసినట్లు తన రెడిట్ పోస్టులో పేర్కొన్నాడు.

కేరళ నుంచి వచ్చిన తనకు ఇలాంటి చేదు అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "భారత్‌లో అసహనం పెరుగుతోందనే మాటలను అతిశయోక్తి అనుకున్నాను, కానీ అది నిజమేనని ఇప్పుడు అర్థమైంది. కేవలం మతం కారణంగా బతుకుదెరువు కోసం రోజూ తమ ఉనికిని నిరూపించుకోవాల్సిన దుస్థితిలో కొందరు బతుకుతున్నారనే వాస్తవం చాలా దారుణం" అని ఆయన అన్నారు.

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో అనేక మంది స్పందించారు. గుర్‌గావ్‌, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో తమకు కూడా ఇలాంటి వివక్షపూరిత అనుభవాలు ఎదురయ్యాయని పలువురు కామెంట్ చేశారు. కేవలం ముస్లింలన్న కారణంతో ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించిన ఘటనలను కొందరు గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాది నగరాల్లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Gurgaon Incident
Gurgaon
Rapido driver
Muslim discrimination
religious discrimination
Kerala man
social media post
Delhi
Gurugram
religious intolerance

More Telugu News