Haragopal: మార్వాడీల నోట్లు కావాలా? తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా?: ప్రొఫెసర్ హరగోపాల్

Telangana Professor Haragopal on Marwadi Business Expansion Concerns
  • మార్వాడీలు తెలంగాణలో చిరు వ్యాపారుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారన్న హరగోపాల్
  • వారి పెట్టుబడుల ముందు చిరు వ్యాపారులు నిలవలేకపోతున్నారని ఆందోళన
  • 'మా వ్యాపారాలు మాకే' అనే అంశంపై ఇప్పటికైనా చర్చ జరగాలని వ్యాఖ్య
తెలంగాణలో మార్వాడీ కమ్యూనిటీ వ్యాపార విస్తరణ స్థానిక చిరు వ్యాపారుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందని, వారి ఆధిపత్యం తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా ఉందని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారి భారీ పెట్టుబడుల ముందు స్థానిక చిన్న వ్యాపారులు నిలబడలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిన్న నిర్వహించిన ‘మార్వాడీ సమస్య - పరిష్కారాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘మా వ్యాపారాలు మాకే’ అనే నినాదం రాలేదని, ఆలస్యంగానైనా ఇప్పుడు ఈ అంశంపై చర్చ జరగడం అవసరమని అభిప్రాయపడ్డారు. స్థానిక వ్యాపారులు, చేతివృత్తుల వారికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. ‘మార్వాడీల నోట్లు కావాలా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా? అనేది రాజకీయ నాయకులు తేల్చుకోవాలని ఆయన అన్నారు.

ఈ సదస్సులో పాల్గొన్న ఆర్యవైశ్య, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు కూడా మార్వాడీల వ్యాపార విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మార్వాడీలు గ్రామాల్లోకి సైతం చొచ్చుకొచ్చి తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు. ఆహార ఉత్పత్తుల కల్తీ దందాలో 97 శాతం మార్వాడీలే ఉన్నారని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ ఆరోపించారు. మార్వాడీల వల్ల రాష్ట్ర జీడీపీ పెరిగిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధి సముద్రాల శ్రీకాంత్ తప్పుబట్టారు. జీఎస్టీ ఎగవేసే వాళ్లతో జీడీపీ ఎలా పెరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

సదస్సు ముగింపులో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. స్థానికుల వ్యాపారాలను పరిరక్షించేందుకు, తెలంగాణేతరులు ఇక్కడ భూములు కొనకుండా చట్టాలు తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రతి సంస్థలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించేలా నిబంధన తీసుకురావాలని కోరారు. గుజరాత్, రాజస్థాన్ వ్యాపారుల వద్ద వస్తువులు కొనుగోలు చేయవద్దని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
Haragopal
Telangana
Marwadi
Local Business
Telangana People
Vote Politics
Business Expansion
Economic Policy
Telangana Identity

More Telugu News