Bhuni Toll Plaza: సైనికుడిపై దాడి.. టోల్ ఏజెన్సీకి రూ. 20 లక్షల జరిమానా!

Bhuni Toll Plaza Fined Rs 20 Lakhs After Soldier Assault
  • మీరట్‌ టోల్ ప్లాజాలో ఆర్మీ జవాన్‌పై సిబ్బంది దాడి
  • సంస్థ కాంట్రాక్టును రద్దు చేసేందుకు చర్యలు ప్రారంభం
  • భవిష్యత్ బిడ్ల నుంచి ఏజెన్సీని నిషేధించే యోచన
  • ఘటనపై కేసు నమోదు.. ఆరుగురు సిబ్బంది అరెస్ట్
సైనికుడిపై టోల్ ప్లాజా సిబ్బంది దాడి చేసిన ఘటనను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉన్న భూని టోల్ ప్లాజా నిర్వాహక ఏజెన్సీకి రూ. 20 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ మేరకు నిన్న ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కేవలం జరిమానాతోనే సరిపెట్టకుండా సదరు ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్టు ఎన్‌హెచ్ఏఐ వెల్లడించింది. భవిష్యత్తులో టోల్ ప్లాజా బిడ్లలో పాల్గొనకుండా ఆ సంస్థను నిషేధించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సిబ్బంది క్రమశిక్షణను, పరిస్థితులను అదుపు చేయడంలో ఏజెన్సీ విఫలం కావడం ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది. ఈ ఏజెన్సీని మెసర్స్ ధరమ్ సింగ్‌కు చెందినదిగా పేర్కొంది.

మీరట్-కర్నాల్ జాతీయ రహదారి 709ఏ పై ఉన్న భూని టోల్ ప్లాజా వద్ద ఈ నెల 17న ఈ ఘటన చోటుచేసుకుంది. గోట్కా గ్రామానికి చెందిన సైనికుడు కపిల్ సెలవుల అనంతరం విధులకు తిరిగి వెళ్తుండగా టోల్ సిబ్బందితో వాగ్వివాదం జరిగింది. ఇది కాస్తా పెరిగి దాడికి దారితీసింది.

ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణికుల భద్రతకు, ప్రయాణ సౌలభ్యానికి కట్టుబడి ఉన్నామని, టోల్ ప్లాజా సిబ్బంది ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్‌హెచ్ఏఐ పేర్కొంది.
Bhuni Toll Plaza
Meerut
NHAI
National Highways Authority of India
Toll plaza attack
Indian Army
Soldier assault
Uttar Pradesh
Meerut Karnal Highway
Toll agency fine

More Telugu News