సైనికుడిపై దాడి.. టోల్ ఏజెన్సీకి రూ. 20 లక్షల జరిమానా!
- మీరట్ టోల్ ప్లాజాలో ఆర్మీ జవాన్‌పై సిబ్బంది దాడి
- సంస్థ కాంట్రాక్టును రద్దు చేసేందుకు చర్యలు ప్రారంభం
- భవిష్యత్ బిడ్ల నుంచి ఏజెన్సీని నిషేధించే యోచన
- ఘటనపై కేసు నమోదు.. ఆరుగురు సిబ్బంది అరెస్ట్
కేవలం జరిమానాతోనే సరిపెట్టకుండా సదరు ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్టు ఎన్‌హెచ్ఏఐ వెల్లడించింది. భవిష్యత్తులో టోల్ ప్లాజా బిడ్లలో పాల్గొనకుండా ఆ సంస్థను నిషేధించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సిబ్బంది క్రమశిక్షణను, పరిస్థితులను అదుపు చేయడంలో ఏజెన్సీ విఫలం కావడం ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది. ఈ ఏజెన్సీని మెసర్స్ ధరమ్ సింగ్‌కు చెందినదిగా పేర్కొంది.
మీరట్-కర్నాల్ జాతీయ రహదారి 709ఏ పై ఉన్న భూని టోల్ ప్లాజా వద్ద ఈ నెల 17న ఈ ఘటన చోటుచేసుకుంది. గోట్కా గ్రామానికి చెందిన సైనికుడు కపిల్ సెలవుల అనంతరం విధులకు తిరిగి వెళ్తుండగా టోల్ సిబ్బందితో వాగ్వివాదం జరిగింది. ఇది కాస్తా పెరిగి దాడికి దారితీసింది.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణికుల భద్రతకు, ప్రయాణ సౌలభ్యానికి కట్టుబడి ఉన్నామని, టోల్ ప్లాజా సిబ్బంది ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్‌హెచ్ఏఐ పేర్కొంది.