Chandrababu Naidu: ఏపీలో ఉచిత బస్సు పథకానికి అద్భుతమైన రెస్పాన్స్... ఇక ఘాట్ రోడ్లలోనూ 'స్త్రీ శక్తి' పథకం

AP Free Bus Scheme Sees Huge Response
  • నాలుగు రోజుల్లోనే మహిళలకు రూ.19 కోట్లకు పైగా ఆదా
  • ఘాట్ రోడ్ల బస్సుల్లోనూ పథకం అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్
  • గుర్తింపు కోసం మొబైల్‌లోని సాఫ్ట్ కాపీ చూపినా అనుమతి
  • పథకం అమలు తీరుపై ఆర్టీసీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'స్త్రీశక్తి' పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెద్ద ఎత్తున ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కేవలం సోమవారం ఒక్కరోజే 18 లక్షల మందికి పైగా మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుని జీరో-ఫేర్ టికెట్లతో ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల మహిళలకు ఒక్క రోజులోనే రూ.7 కోట్లకు పైగా ప్రయాణ ఖర్చు ఆదా అయింది.

ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి గత నాలుగు రోజుల్లో మొత్తం 47 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందారు. తద్వారా వారికి సుమారు రూ.19 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరినట్లు అంచనా వేశారు. స్త్రీశక్తి పథకం అమలు తీరు, మహిళల నుంచి వస్తున్న స్పందనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం నాడు సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణ సమయంలో మహిళల గుర్తింపు కోసం ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు, మొబైల్‌లోని డిజిటల్ లాకర్‌లో ఉన్న సాఫ్ట్ కాపీని చూపినా అనుమతించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, ఇప్పటివరకు మినహాయింపు ఉన్న ఘాట్ రోడ్ల సర్వీసుల్లో కూడా స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేయడానికి సీఎం ఆమోదం తెలిపారు. ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ పథకం వల్ల రోజువారీ ప్రయాణాల్లో తమకు ఎంత డబ్బు ఆదా అవుతుందో మహిళలు ఎంతో సంతోషంగా వివరిస్తున్నారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం, ఉచిత ప్రయాణం వర్తించే బస్సులను మహిళలు సులభంగా గుర్తించేలా బస్సు లోపల, బయట స్పష్టమైన బోర్డులు లేదా స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Chandrababu Naidu
AP Free Bus Scheme
Sthree Sakthi Scheme
AP RTC
Andhra Pradesh
Free Bus Travel for Women
Ghat Roads
Zero Fare Tickets
AP Government Schemes
Women Empowerment

More Telugu News