Kethireddy Pedda Reddy: తాడిపత్రికి వెళ్లకుండా పెద్దారెడ్డిని అడ్డుకోవడంపై పోలీసుల వివరణ

Kethireddy Pedda Reddy Stopped from Entering Tadipatri Police Explanation
  • హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టిన పోలీసులు
  • జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమంతో శాంతిభద్రతల సమస్య అంటున్న డీఎస్పీ
  • పోలీసుల తీరుపై రోడ్డుపై బైఠాయించి కేతిరెడ్డి నిరసన
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తాడిపత్రికి వెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చినా, పోలీసులు ఆయనను అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతిభద్రతల కారణాలతోనే ఆయన్ను నిలువరించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతుండగా, ఇది పూర్తిగా రాజకీయ కుట్రేనని కేతిరెడ్డి ఆరోపిస్తున్నారు.

తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు తనకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని, తనను దగ్గరుండి పట్టణంలోకి తీసుకెళ్లాలని ఆదేశాలు ఉన్నాయని కేతిరెడ్డి చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

ఈ ఘటనపై డీఎస్పీ వెంకటేశులు స్పందించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరుగుతోందని, దానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు. అదే సమయంలో కేతిరెడ్డి పట్టణంలోకి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఆపాల్సి వచ్చిందని వివరించారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళతామని ఆయన స్పష్టం చేశారు.

పోలీసుల చర్యపై ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వానికి కాకుండా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. “పోలీసులకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వమా లేక జేసీనా?” అని ఆయన ప్రశ్నించారు. గతంలో తాను ఎలాంటి ఫ్యాక్షనిజం చేయలేదని, అయినా తనను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. పోలీసుల తీరుపై మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని కేతిరెడ్డి తెలిపారు. 
Kethireddy Pedda Reddy
Tadipatri
Anantapur
JC Prabhakar Reddy
Andhra Pradesh Politics
YSRCP
TDP
Law and Order
Political Conflict

More Telugu News