Vangalapudi Anita: నెల రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్‌లకు కొత్త వాహనాలు: ఏపీ హోమ్ మంత్రి అనిత

Vangalapudi Anita Announces New Vehicles for All Police Stations
  • నక్కపల్లి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి అనిత
  • పోలీస్ వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నామన్న మంత్రి  
  • రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న అనిత
పోలీస్ స్టేషన్లకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత శుభవార్త తెలిపారు. నెల రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్లకు నూతన వాహనాలు అందుబాటులోకి వస్తాయని ఆమె వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నూతన పోలీస్‌స్టేషన్‌ భవన నిర్మాణానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి ఆమె నిన్న శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పోలీస్ వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నామని, వారికి మెరుగైన సౌకర్యాలతో పాటు సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి రూ.2.5 కోట్లు సీఎస్ఆర్ నిధులు కేటాయించిన హెటిరో సంస్థ యాజమాన్యానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కృషితో లా అండ్ ఆర్డర్ విషయంలో రాష్ట్రాన్ని దేశంలోనే రెండో స్థానంలో నిలిపామని సగర్వంగా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 60 వేల సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని, లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. బస్టాండ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాలు, ఇతర ముఖ్య కూడళ్లలో వీటిని అమర్చుతున్నామని, ఇవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి నేరాల నియంత్రణను మరింత సమర్థంగా నిర్వహించగలుగుతున్నామని వివరించారు.

వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూ, గత ఐదేళ్ల వైకాపా పాలనలో పోలీస్ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి అనిత ఆరోపించారు. "మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నెల రోజుల్లో అన్ని పోలీస్‌స్టేషన్లకు కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయి" అని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ తుహిన్ సిన్హా, ఇతర పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 
Vangalapudi Anita
Andhra Pradesh police
police stations
new vehicles
law and order
Chandrababu Naidu
crime control
CC cameras
Anakapalle
Harish Kumar Gupta

More Telugu News