JC Prabhakar Reddy: ఓపక్క జేసీ కార్యక్రమం.. మరోపక్క పెద్దారెడ్డి ఎంట్రీ.. తాడిపత్రిలో హైటెన్షన్!

JC Prabhakar Reddy Tadipatri Tension with Peddareddy Entry
  • కోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • పోలీసులే భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టీకరణ 
  • శివుడి విగ్రహావిష్కరణకు సిద్ధమైన జేసీ ప్రభాకర్ రెడ్డి
  • కార్యక్రమం వాయిదా వేసుకోవాలని పోలీసుల సూచన
  • నిరాకరించిన జేసీ వర్గం.. భారీగా బలగాల మోహరింపు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. బద్ధ శత్రువులైన టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేపీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన కార్యక్రమాలు ఈరోజు జరగనుండటంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి పోలీసు భద్రత మధ్య తాడిపత్రిలోకి అడుగుపెట్టనుండగా, అదే సమయంలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టారు.

ఈరోజు తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి నిచ్చింది. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో, పోలీసులే దగ్గరుండి ఆయనను యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని తన నివాసం నుంచి తాడిపత్రికి తీసుకెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేతిరెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా, అవసరమైతే పోలీస్ ఫోర్స్ కూడా ఉపయోగించవచ్చని పోలీసులకు సూచించింది. గతంలో తమ ఆదేశాలను పోలీసులు పాటించకపోవడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.

మరోవైపు ఇదే సమయంలో, తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు, కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచిస్తూ నోటీసులు జారీ చేశారు. అయితే, తాము కచ్చితంగా కార్యక్రమం నిర్వహించి తీరుతామని జేసీ వర్గీయులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ రెండు పరిణామాల నేపథ్యంలో తాడిపత్రిలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచారు. దీంతో తాడిపత్రిలో ఏం జరగనుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 
JC Prabhakar Reddy
Tadipatri
Ketireddy Peddareddy
Andhra Pradesh politics
TDP
YSRCP
political tension
Anantapur district
Shiva statue
High Court orders

More Telugu News